ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లి ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ, అమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) తదితర పార్టీలు అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. దాంతో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటిదశ పోలింగ్ మార్చి పదవ తేదీన కావడంతో అభ్యర్దుల ఎంపికపై అన్ని పార్టీలు దృష్టిని కేంద్రీకృతం చేశాయి. ఈ ప్రక్రియకు ముందే ఉత్తరప్రదేశ్‌లోముగ్గురు రాష్ట్ర మంత్రులు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్‌లో 30 మందితో స్టార్ క్యాంపైనర్స్ బృందాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ బృందంలో మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీకీ, ఆమె కుమారుడు, పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీకిచోటు దక్కలేదు. రైతుల ఆందోళనకు మద్దతుగా వరుణ్ ఈ మధ్య వరుసగా ట్విట్టర్‌లో ప్రకటనలు చేయడంతో ఆయనను ఎన్నికల ప్రచారానికి పార్టీ దూరంగా పెట్టి ఉండవచ్చు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లో కీలక మైన అలహాబాద్ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రీటా బహుగుణ జోషి కుమారునికి పార్టీ టికెట్ ఇవ్వనందుకు ఆమె నొచ్చుకున్నారు.
ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు ప్రధాన్‌తో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈసారి పోటీ చేయరని ఓ సారి, అయోధ్య నుంచి పోటీ చేస్తారని మరోసారి వార్తలు వెలువడ్డాయి. అంతిమంగా ఆయన గోరఖ్‌పూర్ నుంచే పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. సమాజ్ వాదీ పార్టీలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేయరని ముందుగా ప్రకటించారు. కానీ, ఇప్పుడు పోటీ చేస్తారని తాజాగా ప్రకటించారు. బీజేపీ నుంచి వలసలను అఖిలేష్ ప్రోత్సహిస్తున్నందుకు ప్రతిగా సమాజ్ వాదీ నుంచి ఫిరాయింపులను బీజేపీ వారు ప్రోత్సహిస్తున్నారు. అఖిలేష్ మరదలు, ములాయంసింగ్ యాదవ్ రెండో కోడలు అయిన అపర్ణ యాదవ్ తమ పార్టీలో చేరడంతో బీజేపీ నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. అపర్ణ యాదవ్ చేరికతో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబీసీల) ముఖ్యంగా యాదవుల ఓట్లు చెక్కు చెదరకుండా ఉంటాయని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల ప్రచారంలో రాష్ట్రంలో జరిగిన మహిళల హత్యాచార సంఘటనల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఉన్నావో ఘటనలో బాధితురాలి తల్లికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అలాగే, బికినీ భామగా పేరుమోసిన అర్చనా గౌతమ్ అనే మోడల్‌కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆమె బుల్లితెర, వెండితెరలపై నటిగా రాణిస్తూనే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోందనీ, ఆమెకు టికెట్ ఇవ్వడం తప్పులేదని కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఆ మాటకొస్తే బీజేపీ కూడా ఈ మాదిరి కళాకారులకు టికెట్లు ఇచ్చిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
సమాజ్ వాదీ పార్టీ తరఫున నేరస్థులకు టికెట్లు ఇస్తున్నారన్న బీజేపీ ఆరోపణను అఖిలేష్ యాదవ్ తిప్పి కొట్టారు. తమ పార్టీ తరఫున టికెట్లు పొందిన వారిలో నేరస్థులు ఎవరూ లేరనీ, వారిపై యోగీ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించడం వల్ల వారిని క్రిమినల్స్‌గా చూపిస్తున్నా రని అఖిలేష్ వాదిస్తున్నారు. అలాగే, తమ కుటుంబంలో చీలికలు లేవనీ, ఒకరో ఇద్దరో బీజేపీలోకి వెళ్ళినంత మాత్రాన సమాజ్ వాదీ పార్టీ బలహీనపడబోదని ఆయన స్పష్టం చేశారు. మరో వంక కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా అభ్యర్ధుల ఎంపిక, ప్రచార బాధ్యతలను చేపట్టారు. మహిళలకు40 శాతం టికెట్లు ఇవ్వాలన్న లక్ష్యంతో జాబితాల వడపోతలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రివిధదళాల కమిటీ అధిపతి బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ రావత్ బీజేపీలో చేరారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ప్రియాంక మౌర్యకు టికెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరేందుకు ఆమె చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి అసంతృప్తిపరులను చివరి క్షణంలో తమ పార్టీలో చేర్చు కునేందుకు బీజేపీ కాంగ్రెస్‌తో పోటీ పడుతోంది.రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఫిరాయిం పులు జోరుగా సాగుతున్నాయి. ఫిరాయింపులను గతంలో వ్యతిరేకించిన బీజేపీ కొన్ని సీట్లకు అభ్యర్ధుల పేర్లను ప్రకటించకుండా ఫిరాయింపుదారుల కోసం ఎదురు చూస్తోంది. నామి నేషన్ల ఘట్టం ముగిసే సమయానికి ఇంకా ఎన్ని ఫిరాయింపులు ఉంటాయో.!
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..