జాతస్య మరణం ధ్రువం… అనే గీతావాక్యాన్ని ఇలాంటి సందర్భాల్లోనే ఉటంకిస్తూ ఉంటారు .యావత్ ప్రపంచంలోని సంగీత అభిమానుల కైమోడ్పులందు కున్న లతామంగేష్కర్ తొమ్మిది పదుల ప్రస్థానాన్ని ముగించుకుని గంధర్వ లోకాలకు తరలి వెళ్ళిపోయా రు. హిందువుల నమ్మకం ప్రకారం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభించని రీతిలో ఆమె మహాపవిత్రమైన వసంత పంచమినాడు తుది శ్వాస విడిచారు.భారత రత్న,పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఆమె ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసి అందరి ఆత్మబంధువుగా శాశ్వత కీర్తిని ఆర్జించారు. ఆమె కేవలం హిందీ చిత్రాలకే పరిమితం కాకుండా తెలుగుతో సహా పలు చిత్రాల్లో గానంచేయడం వల్ల దేశ ప్రజలందరి గుండెల్లో శాశ్వత స్థానాన్ని పొందారు. భాష రాకపోయినా ఆమె పాట రేడియో, సినిమాలలో ప్రసారం అవుతుంటే ఎన్ని పనులున్నా జనం ఇప్పటికీ స్థాణువులవుతూ ఉంటారు.ఆమె గాత్ర మాధుర్యం అటువంటిది. గానానికి పరిథులు,ప్రాంతాలు లేవని ఆమె నిరూపించారు.అన్ని ప్రాంతాల్లో ఆమె అభిమాను లు ఉన్నారు. అందుకే, ఆమె ప్రాణం అనంతవాయువు ల్లో కలిసిందన్న వార్త వినగానే, ఆదివారంనాడు అందరూ నిరంతర వార్తా స్రవంతుల వద్దకు చేరి ఆమె అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ కన్నార్పకుండా వీక్షించారు. అన్ని తరాల్లోనూ ఆమె అభిమానులు ఉన్నారు.
ఆమె స్వర లాలిత్యం, స్వర ప్రస్థానం నభూతో నభవిష్యతి. ఆమె తన తండ్రి వద్ద నేర్చుకున్న స్వరాలను సాధన చేసి ఎంతో ఉన్నత స్థితి చేరుకున్నారు. తండ్రి అకాల మరణంతో మీద పడిన కుటుంబ భారం ఆమెను లక్ష్యానికి దూరం చేయలేకపోయింది.తన సోదరీమణు లందరూ గాయనీమణులుగా ఎదగడానికి ఆమె ఎంతో ప్రోత్సహించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలను ఆమె సైతం ఎదుర్కొన్నారు. చిన్న వయసు నుంచి సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసేందుకు అకుం ఠిత దీక్షతో, నిర్విరామ శ్రమతో ఆమె సాగించిన ప్రస్థానం ఆమెను భారత కోకిలగా నిలబెట్టింది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలలో ఆమె అభిమానులు ఉన్నారు. ఆమె కడసారి చూపు కోసం ముంబాయిలోని శివాజీ పార్క్‌కు లక్షలాది మంది అభిమానులు కరోనా భయాన్ని లెక్క చేయకుండా తరలి వచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులకు జరిగిన స్థాయిలో జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, వివిధ పార్టీల నాయకులు ఆమె పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు.
ఎప్పుడో ఆరున్నర దశాబ్దాల క్రితం ఆమె తెలుగు చిత్రం సంతానంలో ఆలపించిన నిదురపోరా తమ్ముడా పాట ఈనాటికీ రేడియో, టీవీల్లో ప్రసారమవుతుంటే ఆనాటి తరం వారే కాకుండా నేటి తరంవారు కూడా ఎంతో ఆసక్తితో వింటూ ఉంటారు. కష్టాల్లో ఉన్న ఒక యువతి పాత్ర నోటంట వెలువడిన ఆ పాటను ఎంతో సహజత్వం ఉట్టిపడే రీతిలో ఆమె ఆలపించారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొ న్న ఆమె గొంతు నుంచి వెలువడటం వల్లనే ఆ పాటకు అంత సహజత్వం వచ్చిందేమోననిపిస్తుంది. అలాగే, అన్ని భాషల్లో పాటలూ ఆమె నోటంట అంత సహజంగానూ వెలువడ్డాయి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలన్న పెద్దల వాక్కును ఆమె జీవితాంతం పాటించారు. బాలీవుడ్‌లో ఎన్నో తరాల వారితో ఆమెకు సాన్నిహిత్యం ఉంది. ఎటువంటి వివాదాలకు లోను కాకుండా, అందరితో సోదరి వాత్సల్యంతో మెలగడం వల్లనే ఆమె దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచంలోజగదేక జనయిత్రిగా నిలిచారు. క్రికెట్ రంగంలో మాస్టర్ బ్లాస్టర్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ ఆమెను అమ్మా అని సంబోధించేవారట. ఆమె అభిమానుల్లో దేశాధీశుల నుంచి సామాన్యుల వరకూ అన్ని వర్గాల వారూ ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఆమె మరణవార్త వినగానే, తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ముంబాయి చేరుకోవడం ఆమె పట్ల గల అభిమానం, గౌరవానికి నిదర్శనం. లతాజీగా అందరికీ ఆత్మీయురాలిగా మెలిగిన ఆమెకు ఎవరూ సాటిరారు. భారతీయ సంగీతం ఉన్నంత కాలం లతాజీ ఉంటారు. ఆమె స్వరం అజరామరం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..