Tuesday, November 26, 2024

నేటి సంపాదకీయం-వెూడీకి నిరసన సెగ!

భ‌ద్రతా వైఫల్యం వల్ల స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా ప్రధానమంత్రి పర్యటన రద్దయిన సంఘటన బుధవారం పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఇది దేశాధినేతకు జరిగిన అవమానం. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వెళ్ళేందుకు భటిండా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్కడ ఫ్రైఓవర్‌ వద్ద రైతుల ఆందోళన కారణంగా 20 నిమిషాల సేపు అక్కడ నిరీక్షించాల్సివచ్చింది. పంజాబ్‌లోని హుస్సేనీ వాలాలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఫిరోజ్‌ పూర్‌ వెళ్ళాల్సి ఉంది. ఆయన పర్యటన వివరాలను బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వమూ పంజాబ్‌లో అధికారంలో ఉన్నకాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలియజేసింది. అయినప్పటికీ రైతులంతా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను అడ్డంగా పెట్టి ఫ్లైఓవర్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఇందుకు కారణాలపై ఎవరి వాదాలను వారు వినిపిస్తున్నారు.

అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమలనాథులు ఆరోపించారు.ప్రధాని పర్య టన గురించి ముందుగా తెలియజేసినప్పటికీ అప్రమత్తంగా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నది వారి వాదన. అయితే, భటిండా నుంచి హుస్సేనీవాలాకు హెలికాప్టర్‌లో వెళ్ళాలనుకున్న ప్రధాని చివరిక్షణంలో రోడ్డు మార్గంలో వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని చివరి క్షణంలో ప్రధాని పర్యటనలో మార్పు వల్ల కొంత గందరగోళం జరిగిందని కాంగ్రెస్‌ పేర్కొంది.ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని సభ రద్దుు అయ్యేట్టు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని కూడా కమలనాథులు ఆరోపించారు. అయితే, ఫిరోజ్‌పూర్‌ సభకు జనం రాకపోవడం వల్ల సభను కమలనాథులు రద్దు చేసుకున్నారనీ, బీజేపీ కార్యకర్తలను రాష్ట్ర పోలీసులు ఎక్కడా అడ్డుకోలేదనీ, హర్యానా నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు వచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా స్పష్టం చేశారు.

ఫిరోజ్‌పూర్‌ రద్దుకు కారణం మీరంటే మీరని బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పరం చేసుకున్న ఆరోపణలను అటుంచితే, ప్రధానమంత్రి పర్యటనకు ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, ప్రోటోకాల్‌ని పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సైతం ఆరోపిస్తున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన సునీల్‌ జక్కర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీపై నిప్పులు చెరగడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారు. ప్రధానమంత్రి ఏ పార్టీకి చెందిన వారైనా దేశాధినేతగా ఆయనకు గౌరవం ఇవ్వాల్సిందేనని జక్కర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ ముఖ్యమంత్రి చన్నీ అసమర్ధత, నాయకత్వ లోపం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు.

అయితే, ఫ్లైఓవర్‌ వద్ద రైతులు ప్రదర్శన జరపడానికి అసలు కారణం సాగు చట్టాలను మళ్ళీ తెస్తామంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రతోమార్‌ ప్రకటించడం. దీంతో మోడీ ప్రభుత్వం అసలు రంగు బయటపడిందని రైతుసంఘాల నాయకులు ఆగ్రహిస్తున్నారు. అంతేకాక, ఏడాది పాటు జరిగిన రైతుల ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న తమ డిమాండ్‌పై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించ డాన్ని వారు ఖండిస్తున్నారు. రైతుల ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు సాయం అందించకుండా, అలనాటి అమరవీరులకు నివాళులర్పించడంలో అర్థం లేదని వారంటున్నారు. భగత్‌సింగ్‌ వంటి దేశ భక్తుల పేర్లను ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని సూర్జేవాలా ఆరోపించారు. భద్రతా వైఫల్యమేమీ లేదని ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, రాష్ట్ర పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

తాను ప్రాణాలతో తిరిగి భటిండా వచ్చేందుకు సహకరించినందుకు ముఖ్యమంత్రి చన్నీకి కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ అసెంబ్లికి త్వరలోజరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరఫున ప్రచారం కోసం ప్రధాని మోడీ ఫిరోజ్‌పూర్‌ సభలో ప్రసంగించాలనుకున్నారు.అయితే, పంజాబ్‌లో బీజేపీ పరిస్థితి గతంలోమాదిరిగా లేదు. అక్కడ బీజేపీని మాజీ మిత్ర పక్షమైన అకాలీదళ్‌ కూడా వ్యతిరేకిస్తోంది. ఇటీవల సాగిన సాగుచట్టాల వ్యతిరేక ఆందోళనలో అకాలీదళ్‌ కూడా చురుకుగా పాల్గొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలో పాల్గొన్న పంజాబ్‌ రైతులే ఇప్పుడు కూడా నిరసన ప్రదర్శన జరిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement