కరోనా మరో దశ తప్పదన్న హెచ్చరికలు ఒక పక్క వినిపిస్తున్నాయి. దాని కొనసాగింపుగా వచ్చిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇప్పటికే వెయ్యి దాటింది. గడిచిన కొంత కాలంగా పదివేలకు దిగువన నమోదవుతున్న కరోనా కేసులు 13వేలు దాటాయి. దేశ వ్యాప్తంగా 22రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ప్రజల సహనాన్ని పరీక్షించే రీతిలో పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సైతం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను యథాప్రకారంజరిపించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాజకీయ పార్టీలు కోరాయంటే వాటి తీరు ఏమిటో స్పష్టం అవుతోంది. అధికారమే రాజకీయ పార్టీల పరమ లక్ష్యమన్న మాట నిజమే. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రధాన మైనది. దానిని ఎవరూ కాదనరు. పది మంది గుమికూడితేనే వైరస్ సులభంగా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శుభకార్యాలు, మత సంబంధమైన ఊరేగింపులు వాయిదా వేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
తరతరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలను సైతం అయిందనిపించే తీరులో నిర్వహిస్తున్నారు. వర్చువల్ సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలను నిర్వహించి తీరాలని స్పష్టం చేయడం వల్ల రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం అధికారమేనని మరోసారి రుజువు అవుతోంది. తమ ప్రాంత సమస్యలపై నాయకులను నిల దీసే సందర్భాల్లో స్థానికులు మా ఓట్లు కావాలి కానీ, మా బాధలను పట్టించుకోరా అని నాయకులను నిలదీసిన సందర్భాలు అనేకం. కొన్ని చోట్ల తమ కాలనీలో పౌర సమస్యలను పరిష్కరించనిదే రావద్దని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అయినా పార్టీల వైఖరిలలో మార్పు రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలను నిర్వహించాలని పార్టీలన్నీ ఏక గ్రీవంగా కోరినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సుశీల్ చంద్ర తెలిపారు.
అయితే, ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాలను జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి సారి నియమావళి అమలులో ఉంటుంది. ఆ నియమావళిని ఒక్క పార్టీ కూడా పాటించడం లేదు. బలవంతునిదే అధికారం అన్న చందంగా పోలింగ్ జరుగుతున్న ఉదంతాలను కళ్ళారా చూస్తున్నాం. పోలింగ్‌లో రిగ్గింగ్ జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తే, గెలవలేక చెప్పే మాటలుగా వాటిని అధికార పార్టీ నాయకులు తేలిగ్గా కొట్టివేయడం పరిపాటి అయింది. బలహీనవర్గాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో, వార్డులలో పోలింగ్ తక్కువ శాతం నమోదు కావడానికి పలుకుబడి గల వర్గాలు బెదిరింపులే కారణం. కరోనా వంటిమహమ్మారి వ్యాపించినప్పుడు మరింత అసాధారణ పరిస్థితి నెలకొంటుంది. ఈ విషయం పాలకులకు తెలుసు.ఎన్నికలను నిర్వహించే అధికారయంత్రాంగానికీ తెలుసు.
అయినప్పటికీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని మొక్కుబడి వ్యవహారంగానే భావించాలి. ఇలాంటి సమావేశాల్లో సహజంగా అధికార పార్టీ నాయకుల గళమే వినిపిస్తుంది. చిన్నలేదా బలహీన వర్గాల ప్రాబల్యం ఉన్న పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను చెప్పాలని అనుకున్నా, వారికి ఆ అవకాశం రాదు. ఒక వేళ చెప్పినా వాటిని పరిగణనలోకి తీసుకోరు. మన ప్రజాస్వామ్యంలో సర్వత్రా కనిపిస్తున్న వాస్తవ పరిస్థితి ఇది.
అందువల్ల యూపీలో ఎన్నికలను నిర్వహించాలంటూ అన్ని పార్టీలూ కోరాయని ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ప్రకటన ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉందని పాలకులు ప్రకటిస్తూ ఉంటారు కానీ, మన దేశంలో టిఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో ఎన్నికల కమిషనర్లు అంతా జీ హుజూర్ తరహాలోనే పని చేస్తున్నారన్నది సామాన్యునికి సైతం తెలిసిన వాస్తవం. రాజకీయ పార్టీల్లో కూడా ఐక్యత లేదు. ప్రజాశ్రేయస్సు కన్నా, వీలైనంత త్వరగా గద్దెనెక్కాలన్న యావ అన్నిపార్టీల్లో ఉంది. అసెంబ్లి ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రెండు రాష్ట్రాల్లో గతంలో ఏ ప్రధానమంత్రీ తిరగని రీతిలో సుడిగాలి పర్య టనలు జరుపుతున్నారు.
ఎన్నికల ముందు వేలకోట్ల రూపాయిల పథకాలనూ, ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదేళ్లలో ముఖ్యమంత్రులను పదే పదే మార్చాల్సిన పరిస్థితి వచ్చినా, ఆ చిన్న రాష్ట్రంలో సైతం అధికారాన్ని కాపాడుకునేందుకు పదే పదే పర్యటనలు జరుపుతున్నారంటే ప్రజల ఆరోగ్యం కన్నా వారి ఓట్లే ముఖ్యంగా పాలకులు పరిగణిస్తున్నారని స్పష్టం అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital