Saturday, November 23, 2024

నేటి సంపాదకీయం – బ‌డ్జెట్ పై ఆశలు ఆవిరి..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఈ సారి ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చన్న ఊహాగానాలపై గంపెడాశలు పెట్టుకున్న వేతన జీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, పన్నుల రిటర్న్‌లను రెండేళ్ళ వరకూ అప్‌డేట్‌ చేసుకోవడానికి గడువు ఇచ్చారు. ఇది కొంతలోకొంతనయం. దివ్యాంగులకు పన్ను రాయితీ కల్పించడం ముదావహం. వరి, గోధుమ కొనుగోలు, మద్దతుధర కోసం 2.37 లక్షల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. గంగా పరీవాహక ప్రాంతంలో నేచురల్‌ ఫార్మింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. హైటెక్‌ వ్యవసాయానికి సాయమందించనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. డ్రోన్‌ల సాయంతో పురుగుల మందులను చల్లేందుకు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ఖర్చులు తగ్గించనున్నట్టు మంత్రి ప్రకటించారు. రైతులు ప్రస్తుతం చేస్తున్న వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆమె చెప్పారు. ఎరువులపై మూడువేల కోట్లు పైగా సబ్సిడీని తగ్గించి
తమకు తీరని అన్యాయం చేశారని రైతులు వాపోతున్నారు. 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. నూనె గింజల ఉత్పత్తిని పెంచి వంటనూనెల దిగుమతులను తగ్గిస్తామని చెప్పారు. వయోవృద్ధులకు పెన్షన్‌ పరిమితిని పెంచుతారన్న ఆశలు నీరు గారిపోయాయి. అన్నింటికి మించి కేంద్ర నిధుల్లోవాటా గురించి రాష్ట్రాలు ఎంతో కాలంగాచేస్తున్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రి పట్టించుకోలేదు.

అయితే, రాష్ట్రాలకు వడ్డీలేకుండా రుణాన్ని అందించేందుకు లక్ష కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ఊరట నిచ్చే అంశం. అయితే, చిన్న‌, లఘు, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈల)కు ఊతం ఇచ్చేందుకు తగిన నిధులు కేటాయించనున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు. ఈ రంగానికి అదనంగా రెండు లక్షల కోట్ల రుణసహాయం అందనున్నది. రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తులలో 68 శాతాన్ని దేశీయంగా సేకరించాలని నిర్ణయించడం హర్షదాయకం. విదేశీ మారక ద్రవ్యం వ్యయాన్ని పొదుపుచేయడానికి ఇది తోడ్పడవచ్చు. అయితే, లాభాల్లో నడుస్తున్న జీవిత భీమా సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించనున్నట్టు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు నాయకులు దీనిపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది డిజిటల్ రుపీని ప్రవేశపెట్టనున్నట్టు ఆర్థికమంత్రి ప్రకటించారు.
డిజిటల్‌ లావాదేవీల వల్ల దేశంలో ఆర్థికపరమైన అక్రమాలు అరికట్టవచ్చని కేంద్రం దృఢంగా విశ్వసిస్తోంది. క్రిఎ్టో కరెన్సీ చలామణి అధికారికంగా జరగడం లేదు. అయినా దాని లావాదేవీలపై పన్ను వేయడాన్ని బట్టి దానిని ప్రభుత్వం అనుమతిస్తోందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అలాగే, ఒక దేశం- ఒక రిజిస్ట్రేషన్ పథకం కింద దేశంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా చెల్లే పద్దతిని ప్రవేశపెట్టనున్నారు. ఇది కూడా ప్రజలకు మేలు చేసే అంశమే. ఈ బడ్జెట్‌లో ప్రజలకు తాయిలాలూ, వరాలు ఏమీ లేకపోయినా, ప్రజల ఖర్చు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. ఆర్థిక రంగాన్ని పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నదనీ, ప్రధానమంత్రి పదే పదే ప్రస్తావించే ఐదు లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన సాధ్యమేనని నిర్మల ప్రకటించారు.

ఫార్మారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి అవకాశాలు కల్పించడం ప్రధాని దూరదృష్టికి నిదర్శనమని ప్రపంచ దేశాలు శ్లాఘిస్తున్నాయని ఆమె చెప్పారు. అయితే, ఈ బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు కురిపించాయి. ఈ బడ్జెట్‌కి దశ, దిశ లేవని ఆక్షేపించాయి. ఉపాధి కల్పనకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకంపోవడం పట్ల నిరసన తెలిపాయి. గోదావరి- కృష్ణ అనుసంధానానికి తగినన్ని నిధులు, అనుమతులు వెంటవెంటనేమంజూరు చేయని కేంద్రం
గోదావరి-కృష్ణ-పెన్నా అనుసంధానం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించాయి. అలాగే,
జాతీయ రహదారుల విస్తరణకోసం వాజ్‌పేయి ప్రభుత్వం ఇంతకుముందే బృహత్‌ పథకాన్ని అమలు
చేసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంశాన్ని బడ్జెట్‌లోప్రస్తావించకపోవడం గర్హనీయం. అలాగే, తెలుగు రాష్ట్రాల డిమాండ్లపై కేంద్రం కనీసం పరిశీలన చేసిన దాఖలాలేవీ బడ్జెట్‌లో కనిపించ లేదు. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయం ప్రస్తావించకపోవడం ఆంధ్ర ప్రాంతం వారినీ, కాజీ పేట రైల్వే వ్యాగన్ వర్క్‌ షాపు ప్రస్తావన లేకపోవడం తెలంగాణ ప్రజలనూ తీవ్ర నిరాశకు గురి చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement