కరోనా వేరియంట్ ఒమిక్రాన్ అగ్రరాజ్యమైన అమెరికాలో ఒక్క రోజులో పది లక్షల మందికి సోకిందంటే ఆ వైరస్ వేగం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ఇప్పుడు దానికన్నా ఐహెచ్‌యూ అనే కొత్త వేరియంట్ మరింత వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులను సవాల్ చేస్తోంది. ఇది ఎక్కువ ప్రమాదకారి కాకపోయినా, ఎక్కువ మ్యుటేషన్లు ఉండటం వల్ల దీని తీవ్రత హెచ్చుగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ కూడా డెల్టా కన్నా ఎక్కువ ప్రమాదకారి కాదని మొదట్లో వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ వైరస్ ప్రభావం కూడా తీవ్రంగానే ఉందనడానికి అగ్రరాజ్యమైన అమెరికాలో తాజా పరిస్థితే నిదర్శనం. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని మార్వలెస్ నగరంలో ఐహెచ్‌యూ వైరస్ కేసులు 12 వరకూ నమోదు అయ్యాయి. అయితే, భవిష్యత్‌లోఇలాంటి వేరియంట్‌లు ఇంకా పుట్టుకొస్తూనే ఉంటాయని అమెరికాకి చెందిన అంటువ్యాధుల చికిత్సానిపుణుడు ఎరిక్ డింగ్ పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులకు తోడు వివిధ కార్యక్రమాల్లో జనం గుమిగూడి వ్యవహరించడం వల్ల, కరోనా సమయంలో సూచించిన జాగ్రత్తలను పాటించకపోవడం వల్ల కొత్త వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని ఆయన అన్నారు. దీని పుట్టుక ఫ్రాన్స్‌లోనే అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని ఆయన అన్నారు.
అయితే, అమెరికాలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలలో జనం జాగ్రత్తలు పాటించకుండా కలివిడిగా వ్యవహరించడం వల్లనే ఒమిక్రాన్ కేసులు పెరిగి ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ ఇప్పటికే 130 దేశాల్లో వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో అధికంగానూ, ఆంధ్రప్రదేశ్‌లో ఆ తర్వాతి స్థానంలోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.. ఒమిక్రాన్ 23రాష్ట్రాల్లో వ్యాపించింది. 568 కేసులతో మహరాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో కూడా ముంబాయి నగరంలోనే ఎక్కువ కేసులు నమోదు కావడానికి అక్కడ జనసాంద్రత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, వెళ్ళే వారి సంఖ్య అధికం కావడమే కారణం కావచ్చు. ముంబాయిలో అత్యధికంగా కేసులు నమోదు కావడంపై మేయర్ వ్యాఖ్యానిస్తూ ఒమిక్రాన్ సునామీని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముంబాయి తర్వాత ఢిల్లి 385 కేసులతో రెండవ స్థానంలోనూ, రాజస్థాన్, కేరళలలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండువందలకు చేరువలో ఉందని అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో కోవిడ్ కేసుల సంఖ్య 37,379 కు పెరగడంతో థర్డ్ వేవ్ ప్రారంభమైందనే అనుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. బెంగాల్, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో సంక్రాంతిసెలవులు ముందే ప్రకటించారు. ఒమిక్రాన్ వల్ల పెద్దగా భయం లేనిమాటనిజమే కానీ, ఈ కేసులలో కూడా మరణాలు నమోదు అవుతుండటం గమనార్హం. అయితే, ఒమిక్రాన్‌కి ప్రత్యేకంగా వైద్య విధానమేదీ లేదనీ, కరోనా సమయంలోమాదిరి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. పదిమంది గుమిగూడటం, మాస్క్‌లు ధరించకపోవడం వల్లనే వైరస్ వ్యాపిస్తోందని హెచ్చరిస్తున్నా, జనంలో ఇప్పటికీ ఆ జాగృతి కనిపించడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారంలోఉన్నపెద్దలు మాస్క్ ధారణ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం నాడు చెన్నైలో తన కార్యాలయా నికి వెళ్తూ రోడ్డుపై మాస్క్ లేని వ్యక్తిని గుర్తించి వెంటనే కారు దిగి ఆ వ్యక్తికి మాస్క్ తగిలించారు. ప్రచారం కోసమైనా ఏమైనా అధికారంలో ఉన్న పెద్దలుఈ మాదిరి చొరవ తీసుకుంటే అది ప్రచారంగానైనా ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. కరోనా లాక్‌డౌన్ సమయం లో ఎన్ని కష్టాలు పడ్డామో జనానికి అనుభవంఉంది కనుక, దానిని దృష్టిలోఉంచుకుని వైద్యులు సూచించిన జాగ్రత్తలను పాటించడం అవసరం. పనుల్లోకి వెళ్ళే కూలీలు సైతం మాస్క్‌లను ధరించడాన్ని చూస్తున్నాం. ఉద్యోగులు, అధికారులు మాస్క్‌లు లేనిదే బయటకు రావడంలేదు. అయితే, బంధుమిత్రులు ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు మొహమాటం కొద్దీ వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఎంతప్రచారం చేసినా ఇవి అదుపులోకి రావడం లేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital