Friday, November 22, 2024

నేడు పాట్నాలో విప‌క్షాల స‌మావేశం… బిజెపిని ఓడించేందుకు మేథోమ‌థ‌నం ..

పాట్నా – జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. ఆమె ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలిశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్యారు. నితీష్ తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మేమంతా ఒకే కుటుంబంగా కలిసి పోరాడుతామని విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

మరోవైపు నేటి ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలన్ని సమావేశమవుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీని గద్దె దించడానికి జయప్రకాష్ నారాయణ చేసిన విధంగానే ఈసారి నితీష్ కుమార్ చేయాలని భావిస్తున్నారు.

విపక్షాల్లో గంద‌ర‌గోళం..
ఇదిలా ఉంటే భేటీకి ముందే విపక్షాల్లో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎల్డీ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి ఈ సమావేశానికి రానని ప్రకటించారు. దీన్ని ఒక కుటుంబ కార్యాక్రమంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతికి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఇక వైసీసీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ అధినేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి పొసగడం లేదు. బీజేపీ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ గురించి కాంగ్రెస్ ఆప్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బెంగాల్ లో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే మద్దతు ఇవ్వలేనని ఇప్పటికే మమతా చెప్పారు. ఈ నేపథ్యంలో వీరందరి మధ్య సయోధ్య కుదురుతుందా..? లేదా.? అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు యూపీలో బీజేపీ ఓడించాలంటే అన్ని పార్టీలు తమ వెనక నిలబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు. అయితే ఈ ఐక్య‌త‌రాగం ఎటువైపు వెళుతుందో నేటి స‌మావేశం అనంత‌రం తెలిసే అవ‌కాశం ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement