Tuesday, November 26, 2024

ఏపీలో తుఫాన్లతో పొగాకు పంట దెబ్బతింది, రైతులకు పరిహారం చెల్లించాలి.. జీరో అవర్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో సంభవించిన తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. గత 50 ఏళ్లల్లో ఎన్నడూ లేని రీతిలో ఆ ప్రాంతంలో తుఫాన్లు సంభవించి పంట నష్టానికి కారణమయ్యాయని అన్నారు. మొత్తం 53వేల హెక్టార్లలో పొగాకు పంట సాగు చేపట్టారని, కానీ మూడు వారాల క్రితం వచ్చిన తుఫాన్లతో ఏకంగా 25వేల హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక బృందాన్ని పంపించి వాణిజ్య పంటల నష్టంపై అధ్యయనం చేయించాలని ఆయన కోరారు. పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత నష్టపోయిన రైతులకు 100 శాతం వడ్డీ రాయితీతో పంట రుణాలను ఐదేళ్ల పాటు రీ-షెడ్యూల్ చేయాలని, ప్రకృతి వైపరీత్యం కారణంగా జరిగిన నష్టం కాబట్టి నష్టపోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement