Saturday, November 23, 2024

అతి వేగానికి అడ్డుకట్ట.. నేషనల్‌ హైవేల్లో భారీగా స్పీడ్‌ గన్‌లు

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారుల్లో ఇటీవల భారీగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో రహదారి భద్రతపై ఎన్‌హెచ్‌ఏఐ దృష్టి సారించింది. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో అధికశాతం అతివేగం కారణంగానే జరుగుతుండటంతో ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. అతివేగానికి చెక్‌ పెట్టే దిశగా అడుగులు వేయడంతో పాటు నాలుగంచెల రహదారి భద్రత వ్యూహాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా జాతీయ రహదారుల్లో భారీగా స్పీడ్‌ గన్‌లను ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలకు భారీగా జరిమానాలు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రాష్ట్ర జాతీయ రహదారులకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఇంజనీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, ఎమర్జెన్సీ విధానాన్ని రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ వ్యూహం వల్ల ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించే అవకాశాలు ఉండటంతో దీనిని పకడ్భందీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అతివేగంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్లే తరచు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా పలు అధ్యయనాల్లో వెల్లడి కావడంతో వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు అవసరమైన సన్నాహాలు ఎన్‌హెచ్‌ఏఐ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ హైవేస్‌ రీజనల్‌ డైరక్టరేట్‌ కార్యాలయం ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎక్కడికక్కడ స్పీడ్‌ గన్‌లతో అతివేగాన్ని నియంత్రించడంతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ల ద్వారా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర అధికారులతో సమీక్షిస్తున్నారు. హైవేల్లోని స్థానిక పోలీస్‌ సిబ్బందితో పాటు ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే చేపట్టారు. వాహనదారుల చట్టాలతో పాటు డ్రైవింగ్‌ అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా కళాశాల వి ద్యార్థులకు కూడా వాహనాలు నడిపే సమయంలో సీట్‌ బెల్ట్‌ ధరించడంతో పాటు బైక్‌ రైడింగ్‌లో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని అవగాహన కల్పించనున్నారు.

ముఖ్యంగా అతివేగం, రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌ లేని ప్రయాణానికి కొత్త నిబంధనల ప్రకారం ఇన్యూరెన్స్‌ కూడా వర్తించదన్న ప్రధాన అంశాన్ని వివరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నిబంధనలు తరుచూ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో పాటు భారీగా చలాన్లు, జైలు శిక్షలు పడే అవకాశం ఉన్నాయన్న విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. రహదారి వ్యవస్థలో అత్యంత కీలకమైన రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై కూడా ఎన్‌హెచ్‌ఏఐ దృష్టి సారించింది. అవసరమైన చోట ఎప్పటికప్పుడు రోడ్ల మరమ్మతులు శరవేగంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇదే క్రమంలో రహదారుల చిద్రానికి ప్రధాన కారణం భారీ వాహనాల ఓవర్‌ లోడింగే కారణంగా వెల్లడైన నేపథ్యంలో ఇక ఓవర్‌ లోడింగ్‌పై కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలకు వరుద్ధంగా ఓవర్‌ లోడింగ్‌తో వెళ్లే వాహనాలకు భారీ జరిమానాలు విధించనున్నారు. రహదారి భద్రతలో అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ రెస్పాన్సింగ్‌ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే 108తో పాటు నేషనల్‌ హైవే సిబ్బంది, ఇతర అంబులెన్స్‌లు సకాలంలో చేరుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ యంత్రాంగాన్ని బలోపేతం చేయనున్నారు. జాతీయ రహదారుల్లో మరిన్ని అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement