తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సంచలనాలతో ఆకట్టుకుంటున్నారు. మునుపటి సీఎంలకు భిన్నమైన వ్యవహారశైలితో వార్తల్లో నిలుస్తున్నారు. పథకాల అమలు నుంచి, పార్టీ శ్రేణుల క్రమశిక్షణ దాకా తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఆయన చెన్నైలోని కన్నాకి ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునేవారితో మాట్లాడి తిరుగుప్రయాణం అయ్యారు. తన కాన్యాయ్ని ఆపి అటుగా వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సుఎక్కారు. ఈ అనూహ్య పరిణామంతో బస్సు లోని డ్రైవరు, కండక్టర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ముఖ్యమంత్రి ని చూసిన సంతోషంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్.. ఆర్టీసీ సౌకర్యాలపై ప్రజలను ఆరా తీశారు. బస్సులు సమ యానికి వస్తున్నాయా? మహిళలకు ఉచిత టికెట్లు సరిగ్గానే ఇస్తున్నారా? ఉచిత టికెట్ల వల్ల ప్రయోజనం ఉందా? అని అడిగి తెలుసుకున్నారు. బస్సులో కొంతమంది మాస్క్లు పెట్టుకోకపోతే వారికి మాస్క్లు ధరించాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.