బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఇటీవలే ఆయనకు సమన్లు జారీ చేశారు. దీంతో ఈడీకి పూర్తిగా సహకరిస్తానన్న అభిషేక్… ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
కాగా, బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించి నమోదైన ఓ మనీ లాండరింగ్ కేసులో సెప్టెంబర్ 6న విచారణకు హాజరు కావాలంటూ అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. దీనిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. తనపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిజమని తేలితే బహిరంగంగానే ఉరి వేసుకుంటానని ప్రకటించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన బీజేపీ.. రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేకే ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకోవడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.