Tuesday, November 26, 2024

Tirumala : శేషగిరులే హిమాద్రిగా మారినవేళ..

తిరుమల : తెల్లని పొగమంచు తెరల నడుమ, చలచల్లని మలయ వీచికలు గిలిగింతలు పెడుతుంటే తిరుమలకు విచ్చేసే అసంఖ్యాక‌ భక్తులకు క్రొంగొత్త అనుభూతిని కల్గిస్తూ శేషగిరులలోనే హిమగిరులను కూడా దర్శించుకొనే మధురానుభూతిని ప్రకృతీమాత కల్పిస్తున్నది. గత రెండు రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలకు శేషగిరులలో వెలసివున్న అనేకానేక పుణ్యతీర్థాలు, జలపాతాలు జలకళతో ఉట్టిపడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండచరియల నుండి ఎగసిఎగసి పడుతున్న ఈ జలపాతాలను తిలకించడానికి భక్తులు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. తిరుమలలోని వృక్షసంపద, వివిధ వర్ణాలతో కూడిన పుష్పాలు, అరుదైన ఔషధీ మొక్కలు మొదలైనవి వర్షపు బిందువులకు సరికొత్త హంగులను సంతరించుకొని పచ్చదనంతో చూపరులను అలరిస్తున్నాయి. కాగా తిరుమలలో గత రెండు రోజులుగా మండాస్ తుఫాను కారణంగా 210 ఎం.ఎం. వర్షం నమోదు అయిందని అధికారులు తెలిపారు. తిరుమలలోని ఆకాశ గంగా, పాపనాశం, గోగర్భం డ్యాం, కుమార ధర మరియు పసుపుధార జలాశయాలు జల కళతో ఉట్టి పడుతున్నాయి. అదేవిధంగా అక్కగార్ల గుడి వద్ద కురుస్తున్న జలపాతాలు, చెక్ డ్యాంల గుండా ప్రవహిస్తున్న నీటిని, ప్ర‌కృతి ర‌మ‌ణీయ దృశ్యాల‌ను యాత్రికులు త‌మ సెల్‌ఫోన్ల‌లో బంధిస్తున్న దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement