Wednesday, November 20, 2024

Tirumala – శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుక‌గా జ‌రిగింది. డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పుర‌స్క‌రించుకుని ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు గంటల పాటు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి ఆల‌యంలో వంద‌ల సంవ‌త్స‌రాలుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తున్న‌ట్టు చెప్పారు. గ‌ర్భాల‌యం, ఉప ఆల‌యాల గోడ‌ల‌కు ముప్పు వాటిల్ల‌కుండా సుగంధ‌భ‌రిత‌మైన ప‌రిమ‌ళ ద్ర‌వ్యాల‌తో ప్రోక్ష‌ణం చేసిన‌ట్టు తెలిపారు.

కాగా, వేకువజామున స్వామివారికి తిరుప్పావై నివేదించిన‌ ఆనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు పరదాతో కప్పి వేశారు. అనంతరం ఆనందనిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు, ఆలయంలోని ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయశుద్ధి చేసిన అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దయింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు యానాద‌య్య‌, అశ్వ‌ర్థ‌నాయ‌క్‌, నాగ‌స‌త్యం, డా.తిప్పేస్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో లోక‌నాథం, విజివో నంద‌కిషోర్, పేష్కార్ శ్రీ‌హ‌రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement