Tuesday, November 26, 2024

Big Story: తిరుమల లడ్డూకు 306 ఏళ్లు.. నాణ్య‌త‌, రుచిలో ప్ర‌త్యేక విశిష్ట‌త‌!

శ్రీవారిని దర్శించుకునేవారు, ఆరాధించేవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహా ప్రసాదం లడ్డూ. తిరుమల శ్రీవారి లడ్డూకోసం పరితపించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అంత విశిష్టమైన లడ్డూకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటినుంచి ఇప్పటి వరకు రుచిలో, నాణ్యత మెరు గుపరుస్తూ రుచికరంగా తయారవుతున్న లడ్డూలు సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, పచ్చకర్పూరం, నెయ్యితో ఘుమఘులాడుతుంటాయి. 1940 నుంచి లడ్డూలో రుచి, నాణ్యతలో మార్పులేమీ లేకుండా రుచికరంగా తయారవడం విశేషం. మరికొద్ది రోజులలో శ్రీవారి బ్రహ్మో త్సవాలు ప్రారంభంకానున్నాయి. సాధారణ రోజుల్లోనే లక్షలమంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తారు. ఇక బ్రహ్మోత్సవాలకైతే లెక్కే లేదు. అలా వచ్చే భక్తులు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మ్మోత్సవాలు సెప్టెంబర్‌ 27 నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా జరగనున్న నేపథ్యంలో ఉత్సవ ప్రశస్తి, లడ్డూల విశిష్టత తెలుసుకుందాం.

సృష్టికర్త బ్రహ్మదేముడే కొండలరాయుడి ఉత్సవాలు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణంలో పేర్కొనబడింది. అందుకనే ఈ ఉత్సవాలను బ్రహ్మూత్సవాలని పిలుస్తున్నారు. వేంకటేశ్వరస్వామి వారి అవతార నక్షత్రం కన్యా శ్రవణం రోజు చక్రస్నానానికి ముందు తొమ్మిది రోజులనుండి జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ, ధ్వజారోహణతో ప్రారంభమై ధ్వజావరోహణం, అలాగే చక్రస్నానంతో పరిసమాప్తమవుతాయి.

వేదాలకు ప్రతీకలుగా పేర్కొనే నాలుగు మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు ముందు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో బ్రహ్మాండంగా నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా సప్తగిరులు రకరకాల పుష్పాలు, విద్యుత్‌ అలంకరణలతో భూలోక వైకుంఠంగా కనులవిందుగా ఉంటుంది. నాలుగు మాడ వీధుల్లో వివిధ వాహనాలపై దేవేరులతో ఊరేగుతూ వస్తారు. శ్రీవారి దివ్య దర్శనంతో పునీతులయ్యేందుకు భక్తులు పరితపిస్తారు. చరిత్రకు అందుతున్న ఆధారాల ప్రకారం క్రీ.శ 10వ శతాబ్దంలొనే తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు ఆలయంలోని ఒక తమిళ శాసనం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమలలో కన్యామాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి.

మహాప్రసాదం..

మహత్తు సాక్షాత్తు శ్రీవారి తలపునకు రాగానే మనస్సులో మెదిలేది మహాప్రసాదం లడ్డూ. అగమ శాస్త్రప్రకారం తిరుమలలో అన్ని కైంకర్యాలు జరుగుతాయి. అలాంటి పవిత్ర ప్రసాదాలలో లడ్డూకి ఎంతో పవిత్రత ఉంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మొదలై 306 సంవత్సరాలు దాటింది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆగస్ట్‌ 2వ తేదీ 1715ను మహాప్రసాదం లడ్డూ జన్మదినంగా పేర్కొంటారు. అది అంచెలంచెలుగా రుచులు మారుతూ ఆఖరికి 1940 సంవత్సరం నుండి ప్రస్తుతం మనం పొందుతున్న లడ్డూ ఒకే రుచిలో చేయబడుతోంది.

- Advertisement -

దీనికి వాడే పదార్ధాలు ”దిట్టం”అని పేరు. తయారుచేసే ప్రదేశాన్ని ”పోటు”గా వ్యవహరిస్తారు. ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం రోజూ లక్ష లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి పోటులో తయారు చేసిన లడ్డూ మాదిరిగా తయారు చేసేందుకు ఎన్నో సంస్థలు ప్రయత్నించి విఫలమైనాయి. ఇంతటి మాధుర్యం, పవిత్రత కలిగిన తిరుమల లడ్డూకి ”జియోగ్రాఫిక్‌ పేటెంట్‌” కూడా ఉంది. అంటే ఈ లడ్డూను మరెవరూ అనుకరించి చెయ్యకూడదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement