హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ బడుల్లో టీచర్ల హాజరు నమోదులో పారదర్శకతను పెంచి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానం టీచర్లకు తలనొప్పులు..తంటాలు తీసుకొస్తున్నాయి. బయోమెట్రిక్ పరికరాల్లో తలెత్తుతున్న సాంకేతికలోపం కారణంగా టీచర్లకు హాజరుపడటం లేదనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బయోమెట్రిక్ హాజరు వేసినా ఒక్కోసారి ఆ మిషన్ తీసుకోవడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. బయోమెట్రిక్ యంత్రాలు సాంకేతిక సమస్యలతో సక్రమంగా పనిచేయడంలేదని చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోనైతే సిగ్నల్స్ సమ్యతో ఇంటర్నెట్ అనుసంధాంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
సెలవుల్లో వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలను మిషన్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని చోట్ల సెలవుల్లో ఉన్న టీచర్ల వివరాలను మిషన్లలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇన్‌ఛార్జ్‌లు వివిధ కారణాలతో నమోదు చేయకపోవడంతో విధుల్లో లేనట్లుగా ఉన్నతాధికారులకు రిపోర్ట్ వెళ్తోంది. దీంతో ఆ జిల్లా డీఈవోలు సెలవుల్లో ఉన్నవారికి షోకాజ్ నోటీసులను అందిస్తున్నారు. ఇది తమకు తలనొప్పిగా మారిందని పలువురు టీచర్లు వాపోతున్నారు.
రాష్ట్రంలో టీచర్లకు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని గతంలోనే 14 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. అయితే కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి ఈ విధానాన్ని అమలు చేయడంలేదు. అయితే కోవిడ్ తగ్గి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మళ్లిd పునరుద్ధరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సెప్టెంబర్ ఒకటోతేదీ నుంచి కొన్ని జిల్లాల్లో అమల్లోకి తీసుకొని రాగా.. మిగితా జిల్లాల్లోనూ దీన్ని అమలు చేసేందుకు గత సెప్టెంబర్ 15న ఉన్నతాధికారులు సమావేశమై దీనిపై చర్చించారు.
ఈక్రమంలో నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాల్లోనూ ఆధార్ బేస్డ్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. ఈనేపథ్యంలోనే టీచర్లకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసేందుకు గానూ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో కావాల్సిన పరికరాలను, గతంలో ఉన్న పరికరాలను అప్డేట్ చేసుకొని ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసుకోవాలని డీఈవోలు, హెడ్మాస్టర్లకు ఈనెల 10న ఆదేశించారు. పాఠశాల్లోని యంత్రాలను పరిశీలించి అవసరంమేరకు రిపేర్లు చేసుకోవాలని టెక్నికల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
ఏమైనా సమస్యలు తలెత్తితే వారికి సంప్రదించాలని ఇద్దరు సభ్యులతో కూడిన టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 14 జిల్లాలతో పాటు కొత్తగా నాలుగు జిల్లాలకు అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 18 జిల్లాల్లో మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన ఆ నాలుగు జిల్లాల్లోనూ పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానం అమలు కావడంలేదని తెలిసింది.
టీచర్లకు తంటాలు…
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల హాజరు కోసం మొన్నటి వరకు మాన్యువల్ రిజిస్టర్‌ను వినియోగించారు. టీచర్ డ్యూటీకి వచ్చిన రోజు అందులో సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్ ఆ స్కూల్ హెడ్‌మాస్టర్ పర్యవేక్షణలో ఉంటుంది. అయితే చాలా స్కూళ్లలో కొందరు టీచర్లు విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్‌లో ఒకేసారి రెండుమూడు రోజుల సంతకాలు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సార్లు ఆ టీచర్ హాజరు కాకున్నా గానీ రిజిస్టర్‌లో సంతకం ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
కొంతమందైతే ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో సమయానికి టీచర్లు హాజరవుతారని, ఉదయం, సాయంత్రం వేళల్లో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ రోజు ఎవరు విధుల్లో ఉన్నారనే విషయం పై అధికారులకు తెలిసిపోతుందని, విధుల్లో పారదర్శకత ఉంటుందని అనుకున్నారు.