Tuesday, November 19, 2024

నిరీక్షించి అలసిపోయా, కాంగ్రెస్‌ అధిష్ఠానంపై అహ్మద్‌ పటేల్‌ కుమారుడు అసహనం

కాంగ్రెస్‌ పార్టీపై దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైసల్‌ పటేల్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మంగళవారం ఫసల్‌ పటేల్‌ సంచలన ట్వీట్‌చేశారు. ‘చాలా రోజులుగా అధిష్ఠానం మాట కోసం ఎదురుచూస్తున్నా. ఉలుకూ లేదు. పలుకూ లేదు. అలసిపోయా. కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ప్రోత్సాహం కూడా కరువైంది. అన్నీ ఆప్షన్లూ నేను తెరిచే పెట్టుకున్నాను’ అంటూ ఫైసల్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది చివరలో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఫైసల్‌ ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో అధికారంగా చేరని ఆయన, ఎన్నికలకు ముందు వేరే పార్టీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేస్తారనే సంకేతాలను ఇచ్చినట్లయింది. తాను గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తానని కూడా ట్వీట్‌చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి భరూచ్‌, నర్మదా జిల్లాల్లోని 7 అసెంబ్లిd నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నా బృందం అంచనా వేస్తుంది. మా ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడానికి అవసరమైతే భారీ మార్పులు చేపడుతుంది. దేవుడు కరుణిస్తే మొత్తం 7 సీట్లు గెలుస్తాం అని మార్చి 27న ఫైసల్‌ ట్వీట్‌ చేశారు. ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీ వాల్‌తో భేటీ కావడం ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. గుజరాత్‌లో అడుగు పెట్టేందుకు ఆప్‌ ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement