Monday, November 25, 2024

TG | ఎమ్మెల్సీ ఉప‌ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం..

నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గెలుపొందారు. మూడు రోజులుగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో.. మొద‌టి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థితో పాటు 43 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా ఎలిమినేట్ కావడంతో తీన్మార్ మలనాన్న విజయం సాధించారు.

రెండో ప్రధాన్యత ఓటులో మల్లన్నకు రాకేశ్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ముందు నుంచీ తీన్మార్ మల్లన్న ఆధిక్యం చూపించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఏ రౌండ్‌లోనూ పోటీ ఇవ్వలేకపోయారు. చివరకు రాకేశ్ రెడ్డి ఎలిమినేషన్ కావడంతోనే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటన చేశారు.

మల్లన్న ప్రయాణమిలా…

తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. 1983 జనవరి 17న తెలంగాణలోని ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపురం గ్రామంలో జన్మించారు. ఓ సాధారణ విలేకరిగా ఆయన ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో పాపులర్ అయిన తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ పేరే ఇప్పుడాయన ఇంటిపేరు అయింది. తీన్మార్ మల్లన్నగానే చాలా మందికి పరిచయం. ఆ తర్వాత ఆయనే సొంతంగా ఓ న్యూస్ ఛానల్ ప్రారంభించి… తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై విశ్లేషణలు చేయడం ప్రారంభించారు.

ప్రధానంగా తెలంగాణలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాలపై ఆయన పోరాటం చేశారు. ఇలా ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఆయన ఓ ట్రెండ్ సృష్టించారని చెప్పవచ్చు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న తీన్మార్‌ మల్లన్నపై అనేక మార్లు దాడులు సైతం జరిగాయి. పోలీసుల వేధింపులు, అరెస్టులు తప్పలేదు. పలు కేసుల కారణంగా ఆయన కొద్దిరోజులు జైలు జీవితం సైతం గడిపారు.

- Advertisement -

గతంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన తీన్మార్‌ మల్లన్న… వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీ మద్దతుతోనే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement