దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థ అయిన టైమ్స్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఇందూ జైన్ కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె.. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇందూ జైన్ 1936 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్‌లో జన్మించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ కుమార్ జైన్ ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె భర్త అశోక్ కుమార్ జైన్ గుండె సంబంధిత సమస్యలతో 1999లో మరణించారు. అనంతరం టైమ్స్ గ్రూప్ బాధ్యతలను ఇందూ జైన్ స్వీకరించారు.
దేశ పారిశ్రామిక రంగానికి ఇందూ జైన్ చేసిన సేవలకు గాను ఆమెను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2015లో 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఇందూ జైన్ ఫోర్స్బ్ ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించారు. భారత్ లోని కుబేరుల్లో 57వ స్థానంలో, ప్రపంచంలో 549వ స్థానంలో నిలిచారు. ఇందూ జైన్ మృతి పట్ల ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.