Friday, November 22, 2024

నేషనల్ కమిషనర్ ఫర్ సఫాయి కర్మచారిస్ పదవీకాలం మూడేళ్ల పెంపు

పారిశుధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారిస్ (NCSK) పదవీకాలాన్ని మరో మూడేళ్ల కాలం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రూ. 43.68 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరించాల్సి ఉంటుంది. అయితే ఈ చర్య కారణంగా దేశంలోని గుర్తింపు పొందిన పారిశుధ్య కార్మికులకు లబ్ది చేకూరుతుంది. 2021 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పారిశుధ్య కార్మికుల సంఖ్య 58,098గా ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ యాజ్ మ్యాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దెయిర్ రిహాబిలిటేషన్ యాక్ట్, 2013లో నిబంధనలను అమలు చేయడం కమిషన్ బాధ్యత. చట్టంలోని నిబంధనలు ఎవరైనా అతిక్రమించినప్పుడు వాటిపై వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ దర్యాప్తు చేస్తుంది. అలాగే పారిశుధ్య కార్మికుల సంక్షేమం, విద్య, వారికోసం ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాల మదింపు కూడా కమిషన్ విధుల్లో భాగమేనని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

పారిశుధ్య కార్మికుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వారు ఇప్పటికీ ఎన్నో కష్టనష్టాలకు లోనవుతున్నారు. పారిశుధ్య రంగంలో మనిషి ప్రమేయాన్ని దాదాపుగా తగ్గించినప్పటికీ, ఆ కోవకు చెందిన ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మురుగునీటి నిల్వట్యాంకులు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే అపాయకరమైన పనుల్లో ఇప్పటికీ పారిశుధ్య కార్మికులను ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం సఫాయ కర్మచారుల సంక్షేమం కోసం ఉద్దేశించిన వివిధ కార్యక్రమాల పర్యవేక్షణను పట్టించుకోవడం ఎంతైనా అవసరమని భావిస్తోంది. దేశంలో మురుగునీటి పారుదల, సెప్టిక్ ట్యాంకులను శుభ్రపరిచే పనిని పూర్తిగా యాంత్రికీకరించడం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ పనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తోందని కేంద్రం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement