ఆంధ్రప్రభ, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సామాజిక మాధ్యమాలకు అడ్డాగా మారింది. ఎక్కడ చూసినా ప్రధాన పార్టీలనుంచి స్వతంత్రుల వరకు సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేసుకొని ప్రత్యర్ధులపై విమర్శలకు ప్రాధాన్యతనిస్తూనే, తాము చేయబోయే పనులపై గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు బౌతిక పద్దతిలో కార్యకర్తలు, నేతలతో ఇంటింగికి చేరిన ప్రచారం ఇప్పుడిప్పుడే సాంకేతికతకు చేరుకుంటోంది. ఎక్కడ చూసినా యువత మొదలుకొని అన్ని వర్గాల ప్రజలకు తప్పనిసరిగా మారిన వ్యాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.
ఇందుకు ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకున్న నేతలు, ఎంతమందికి షేర్ చేసి సమాచారం చేరవేస్తే అంత మొత్తంలో ప్యాకేజీలను మాట్లాడుకుంటున్నారు. దీంతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం ఎన్నికల ప్రచారంతోపాటు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. సోషల్ మీడియా ప్రచారాలపై కీలక గైడ్‌లైన్స్ అమలులో ఉన్నాయి. అభ్యంతరకరమైన అంశాలు పార్టీలుకానీ, సమూహాలు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
సోషల్ మీడియా సమస్యలపై నిరంతర నిఘాతోపాటు ఎన్నికల సంఘానికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికలపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం గూగుల్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలతో సంప్రదింపులు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా, నిబంధనలకు విరుద్దంగా ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఇతర వర్గాలను కించపర్చేలా చేసే పోస్టింగ్‌లపై వివిధ వెబ్‌సైట్ల ద్వారా స్కాన్ చేయించడం ఇప్పటికే ఈసీ అనుసరిస్తోంది. సాంకేతికంగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి ఐపీసి సెక్షన్ల ప్రకారం సైబర్ క్రైమ్ వింగ్ కేసులు నమోదు చేసేందుకు కూడా చట్టంలో అవకాశాలున్నాయి.
తప్పుడు సమాచారం, ఎన్నికల ప్రచారం వంటి బల్క్ ఎస్సెమ్మెస్‌లు చేసినా, రూమర్లను ప్రచారం చేసినా డేగ కన్నుతో కేసులు నమోదయ్యే పరిస్థితులున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక ప్రత్యేక ఖాతాలో ఎన్నికల సమాచారం, తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా సోషల్ మీడియా ఖర్చునూ ఈసీ ఎన్నికల వ్యయంలో చేర్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. అభ్యర్ధులు తమ నామినేషన్‌తోపాటు సోషల్ మీడియా ఖాతావివరాలు కూడా అఫిడవిట్‌లో పొందుపర్చాలి.
సోషల్ మీడియాలో ప్రచారానికి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) ముందస్తు అనుమతి పొందాలి. సోషల్ మీడియా నిర్వహణ చూసుకునే ఉద్యోగుల జీతభత్యాలు, ఇంటర్‌నెట్ ప్రకటనలు, వెబ్ ప్రకటనలు, వెబ్‌సైట్ వ్యయాలు అభ్యర్ధి ఖర్చులో చూపాలి. సోషల్ మీడియా ప్రకటనలపై ప్రతీసారి ఈసీ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయనుంది.