తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో శ్రీ విశ్వనాధం పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టిటిడి ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 32 మంది అధికారులు, 237 మంది ఉద్యోగులకు, ఎస్విబిసి లో 5 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్, ప్రశంసాపత్రం అందజేశారు. టీటీడీ నిఘా, భద్రత విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి శ్రీ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్, శింబా, ఇందు, హంటర్, వర్ష, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్ డ్రిల్, పేలుడు పదార్థాలను, మాదకద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, డిఎల్ఓ రెడ్డప్పరెడ్డి, సిఇ నాగేశ్వరరావు, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజి, అదనపు సివిఎస్వో శివ కుమార్ రెడ్డి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
టిటిడి కార్యనిర్వహణాధికారి గణతంత్ర దినోత్సవ ప్రసంగం…
భారత గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రసంగించారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలి అధ్యక్షులకు, ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంత సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ మరోసారి స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను తెలియజేస్తున్నాను.