నాంపల్లి, ప్రభన్యూస్: నాంపల్లి మండలంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. దేవుని రథాన్ని భద్రపరుస్తున్న క్రమంలో కరెంటు షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా పలువురు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మండల పరిధిలోని కేతపల్లి గ్రామంలోని గుట్టపై శ్రీ సీతారామ, హనుమాన్, దేవాలయం ఉంది. ఆలయానికి చెందిన రథం బయట ఉంది. రథం తయారు చేయించిన వ్యక్తి పసునూరు దయానంద రెడ్డి విదేశాలకు వెళ్తుండగా రథాన్ని గదిలో భద్రపరచాలని అనుకున్నారు. శనివారం పలువురు భక్తులు తాళ్ల సహాయంతో కొంతమంది రథాన్ని నేరుగా పట్టుకొని తోశారు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు రథానికి తగలడంతో కరెంటు సరఫరా అయింది.
కరెంట్ షాక్ తగిలి పట్టుకున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తాడు పట్టుకున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో పెను విషాదం తప్పింది. మృతుల్లో కేతపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(26) ఉన్నారు. మరో వ్యక్తి రాజబోయిన వెంకటయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటు-ంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. నాంపల్లి ఎస్‌ఐ రజనీకర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..