Friday, November 22, 2024

చంపేస్తామ‌ని కేంద్ర మంత్రి గడ్కరీకి బెదిరింపులు.. దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్డులో కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరీ అధికారిక నివాసంలో ల్యాండ్‌లైన్‌ నెంబరుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి వచ్చిన ఆ కాల్‌ను మంత్రి కార్యాలయం సిబ్బందిలో ఒకరు అందుకున్నారు. తన వివరాలు చెప్పకుండా మంత్రితో మాట్లాడాలని, ఆయన్ను బెదిరించాలని కాల్‌ చేసిన వ్యక్తి అన్నాడని పోలీసులు తెలిపారు. ”ఆగంతకుడు హిందీలో మాట్లాడుతూ ”ముజే మంత్రి జీ బాత్‌ కర్నా హై, ఉన్హె త్రెటెన్‌ కర్నా హై (నేను మంత్రిగారితో మాట్లాడాలి, ఆయన్ను బెదిరించాలి)” అని అన్నాడు.

వెంటనే కాల్‌ డిస్‌కనెక్ట్‌ చేశాడు” అని పోలీసులు చెప్పారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అన్ని కాల్‌ రికార్డుల తాలూకు వివరాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ల్యాండ్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేసిన నిందితుడిని గుర్తించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్టు ఢిల్లి పోలీసులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో రెండు వేర్వేరు సందర్భాల్లో నాగపూర్‌లో మంత్రి గడ్కరీ కార్యాలయానికి కూడా అలాంటి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement