హైదరాబాద్: సులభంగా డబ్బులు సంపాదించాలని మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకులతో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను యాదాద్రి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడారు. పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని.. అతనికి తుపాకీ తయారు చేయడం తెలుసని సీపీ చెప్పారు.
అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులు గతంలో జనశక్తి పార్టీలో పనిచేశారని చెప్పారు. ఆ పరిచయంతో యాదాద్రి శివారు ప్రాంతాల్లో దారి దోపిడీలు, షాపుల్లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఒక నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు, 15గ్యాస్ సిలిండర్లు, బులెట్లలో వాడే పౌడర్ 40గ్రాములు, మావోయిస్టు లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మెషిన్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.