ముంబై – దేశ విదేశీ ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహారాష్ట్ర ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2 ను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్లో బెదిరించారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వివరాలలోకి వెళితే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిన్న ఓ మెయిల్ వచ్చింది. ‘విమానాశ్రయానికి ఇదే మా చివరి హెచ్చరిక. 48 గంటల్లో బిట్‌కాయిన్ రూపంలో ఒక మిలియన్ డాలర్లు ఇవ్వకపోతే.. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2పై బాంబు దాడి చేస్తాము. 24 గంటల తర్వాత మరో మెయిల్ పంపిస్తాం’ అంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపు మెయిల్ పై వెంటనే స్పందించిన విమానాశ్రయ అధికారులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.