Friday, November 22, 2024

కేజీబీవీల్లో వెయ్యి టీచింగ్‌ పోస్టులు.. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి చ‌ర్చ‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2022-23 వచ్చే విద్యా సంవత్సరానికిగానూ రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) టీచింగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అన్ని కేజీబీవీల్లో 1000 వరకు ఖాళీ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 475 కేజీబీవీలు ఉన్నాయి. వాటిలో 172 వరకు ఇంటర్మీడియట్‌ విద్యగా ఇప్పటికే అప్‌గ్రేడ్‌ అయ్యాయి. మరో 36 విద్యాలయాలను కూడా గతంలో అప్‌గ్రేడ్‌ చేస్తూ విద్యాశాఖ ప్రకటించింది. ఈ విద్యాలయాల్లో 6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అందిస్తున్నారు. అన్ని వర్గాలకు చెందిన, బడి మానేసిన బాలికల సంఖ్యను నియంత్రించడంతో పాటు బాలికలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించేలా వీటిని అభివృద్ధి చేస్తున్నారు.

ఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరానికి సరిపడా టీచింగ్‌ సిబ్బందిని తీసుకునేందుకు 1000 వరకు టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులను కాంట్రాక్టు పద్ధతిన నియమించనున్నారు. ప్రస్తుతం ఉన్న 475 విద్యాలయాల్లో టీచింగ్‌ సిబ్బంది సుమారు 9,500 మంది, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది 4,750 వరకు ఉంటారు. త్వరలోనే 1000పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రకటనను అధికారులు విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే వీరిని రాతపరీక్ష ద్వారా కాకుండా కేవలం ఇంటర్వ్యూల ద్వారా తీసుకునే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement