Wednesday, November 20, 2024

నోట్ల గుట్టలు ఏ మజిలీకి, ఈడీ సోదాల్లో వేలకోట్లు పట్టివేత.. మూడు నెలల్లో 100 కోట్లు జప్తు

దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ప్రతీసారి కోట్లాది రూపాయలను జప్తు చేస్తోంది. గత ఏడాది కాలంలో దాదాపు వెయ్యికోట్లకు పైగానే నగదును స్వాధీనం చేసుకుంది. గత మూడు నెలల వ్యవధిలోనే రూ.100 కోట్లను సీజ్‌ చేసింది. మొన్నటికిమొన్న గేమింగ్‌ అప్లికేషకు సంబంధించిన కేసులో కోల్‌కతా వ్యాపారవేత్త నివాసంలో రూ.17 కోట్లకుపైగా స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొమ్మును లెక్కించేందుకు అధికారులతోపాటు భారీ సంఖ్యలోనే లెక్కింపు యంత్రాలను ఉపయోగించారు. అంతకుముందు ఎస్‌ఎస్‌సి స్కామ్‌లో మాజీ మంత్రి పార్థచటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.50 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రూ.20 కోట్లు సీజ్‌ చేశారు. ఇవేకాకుండా వేర్వేరు ఇతర కేసుల్లో నిర్వహించిన దాడులు, దర్యాప్తుల్లో భారీగానే నగదు, బంగారం, దస్త్రాలను సీజ్‌ చేసింది.

ఈ సొమ్ము ఏమవుతోంది?

ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ సోదాల్లో పట్టుబడిన సొమ్మును ఏం చేస్తుంది? ఎక్కడికి తరలిస్తుంది? ఈ సొమ్మంతా ఏమవుతోంది? తిరిగి చలామణిలోకి వస్తుందా? అనే సందేహాలు చాలా మంది వ్యక్తంచేస్తుంటారు. ప్రొటోకాల్‌ ప్రకారం ఈడీ అధికారులు నగదును జప్తు చేసినప్పుడు, ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చెప్పమని నిందితుడిని కోరుతుంది. అతడు సరైన ఆధారాలతో సమాధానం ఇవ్వలేని పక్షంలో, ఆ మొత్తాన్ని లెక్కల్లో చూపని లేదా అక్రమ సంపాదనగా నిర్ధారిస్తుంది. తదనంతరం మనీలాండరింగ్‌ నిరోధక చట్టంకింద నగదు స్వాధీనం చేసుకుంటుంది. కరెన్సీ లెక్కింపు తర్వాత బ్యాంకు అధికారుల సమక్షంలో ఈడీ అధికారులు జప్తు జాబితా సిద్ధం చేస్తారు. ఆనగదును బాక్సుల్లో పెట్టి సీల్‌ వేస్తారు. రికవరీ చేసిన నగదును ఆ రాష్ట్రంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు పంపబడుతుంది. అక్కడ ఈడీ వ్యక్తిగత డిపాజిట్‌ (పీడీ) ఖాతాలో జమ చేయబడుతుంది. అంటే అధికారికంగా ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది.

విచారణ ముగిసేవరకు బ్యాంకులోనే?

అయితే, స్వాధీనం చేసుకున్న సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, బ్యాంక్‌, లేదా ప్రభుత్వం ఉపయోగించ కూడదు. ఏజెన్సీ రూపొందించిన తాత్కాలిక అటాచ్‌మెంట్‌ను ఆరు నెలల్లోగా న్యాయనిర్ణేత నిర్దారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసులో విచారణ ముగిసేవరకు డబ్బు బ్యాంకులో ఉంచబడుతుంది. నిందితుడు దోషిగా తేలితే, నగదు మొత్తం కేంద్రానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది. ఒకవేళ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదలచేస్తే, జప్తు చేయబడిన సొమ్ము అతనికి తిరిగి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement