నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న దురాలోచనతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు పేపర్ లీకేజీ కుట్ర చేసిన నాయకులు జైలు పాలయ్యారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూరు గ్రామ సమీపంలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నాయని దుయ్యబట్టారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేందుకు ప్రతిపక్ష పార్టీలు పేపర్ లీకేజీ చేసి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చేతనైతే అభివృద్ధికి అండగా నిలవాలి తప్ప రాజకీయ పబ్బం కోసం అడ్డదారుల్లో వెళ్లకూడదని హితవు పలికారు. అడ్డదారిలో ప్రయాణించే వారిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు త్వరలోనే వారికి ప్రజలు ప్రజా కోర్టులో సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
అభివృద్ధిలో సీఎం కేసీఆర్ ను మించిన వారు లేరు
పేద ప్రజలు తమ కష్టాలను కనిపించని దేవుడికి చెప్పుకుంటే తీరుతాయో లేదో కానీ సీఎం కేసీఆర్ కు చెప్పుకుంటే ఎంతటి సమస్య అయినా తీరిపోతుందన్నారు ప్రజల మొరను ఆలకించడంలో సీఎం కేసీఆర్ ను మించిన నాయకుడు లేరన్నారు. తన 45 యేళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి దయాదాక్షిన్యాలు దానధర్మాలు చేయడంతో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు ఆయన హయాంలో మంత్రిగా స్పీకర్గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు . బాన్సువాడ నియోజకవర్గంలో వేలాది మందికి పింఛన్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రైతుబంధు రైతు బీమా కేసీఆర్ కిట్ కమ్యూనిటీ హాల్ మిషన్ భగీరథ కంటి వెలుగు గొర్రెలు చేప విత్తనాల పంపిణీ వంటి పథకాలకు ప్రత్యేక వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకం అందించామని గుర్తు చేశారు వైద్య పరంగాను ప్రభుత్వ ఆసుపత్రులు రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు తల్లిపాల ప్రోత్సాహంలో బాన్సువాడ మాత శిశు ఆసుపత్రికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అభినందనీయమన్నారు. దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేదు
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికి లేదన్నారు ఈ మధ్య రాష్ట్రంలో కొత్త బిచ్చగాడు అధికారం కోసం బయలుదేరారని పేర్కొన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర సంపద వ్యక్తిగత సంపద రైతుల సంపద పెరిగిందన్నారు. ప్రజాభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్చుకోవడం లేదని విమర్శించారు అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష తప్ప ప్రజలకు మేలు చేసే పనులు ఒకటి చేయడం లేదన్నారు దమ్ముంటే ప్రజలను మెప్పించి ఓట్లు పొందాలని సూచించారు.
ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను
నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానంలో నియోజకవర్గ ప్రజలు నా వెన్నంటే ఉన్నారని వారికి ఎలాంటి కష్టం వచ్చినా నాతోపాటు నా కుటుంబ సభ్యులు అండగా ఉంటామని స్పీకర్ పోచారం పేర్కొన్నారు ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో తనను గెలిపిస్తూ అసెంబ్లీకి పంపారని గుర్తు చేశారు. మీ ఓటు నియోజకవర్గ అభివృద్ధికి నాంది అని పేర్కొన్నారు మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఏ ఒక్కరికి కష్టం వచ్చినా తనతో పాటు కుటుంబ సభ్యులు అండగా ఉంటారని మరో మారు భరోసా ఇచ్చారు బాన్సువాడ నియోజకవర్గం సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో, దేశంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన జీవితాశయం అని పేర్కొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో వనభోజనం..
ఆత్మీయ సమ్మేళనానికి కుటుంబాలతో కలిసి ప్రతి ఒక్కరు రావడం ఆనందంగా ఉందన్నారు ఏ వ్యక్తి ఏ రంగంలోనైనా రాణించాలన్న జీవితంలో పైకి రావాలన్నా భార్య సహకారం ఉండాలన్నారు మహిళలు సహకరించిన చోటే లక్ష్మి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏ ఆడబిడ్డకు కష్టం కలిగించరాదని సూచించారు అనంతరం మహిళలతో కలిసి వనభోజనం చేశారు సమ్మేళనంలో నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆత్మీయ సమ్మేళనం విజయవంతానికి బాన్సువాడ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నారోజి గంగారం, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ , మండల టిఆర్ఎస్ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ , మండల కార్యదర్శి బాలరాజ్, సంజీవరెడ్డి, తోట సంగయ్య ,బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర దేశాయ్, యూత్ నాయకులు కన్నే రవి, శానం భాగ్య, గంగమణి ప్రసాద్, భాగ్య భూషణ్, గంగారం సావిత్రి లింగం ,బాపూజీ, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత దేశాయ్, పత్తి రాము ,సంజీవులు, తోట గంగారం తదితరులు పాల్గొన్నారు.