Friday, November 22, 2024

కరోనా క్యారియర్లుగా ఆర్టీసీ బస్సులు

రాష్ట్రంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు మూసివేసినప్పటికీ, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు యధావిధిగా పని చేస్తున్నాయి. విధులకు హాజరయ్యేందుకు వెళ్ళే వారిలో కొంత మంది ప్రజా రవాణాపైనేఆధారపడుతున్నరు. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ బస్సులు కరోనా విస్తరణకు కారకులుగా మారుతున్నాయి. గత సంవత్సరం కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రయాణికుల భద్రత, సంరక్షణ కోసం పలు చర్యలు తీసుకున్న ఆర్టీసీ ఈ సారి ఆ చర్యలన్నింటినీ మడిచి మూలన పెట్టింది. బస్సులను నిత్యం శానిటైజ్ చేయడాన్ని పూర్తిగా విస్మరించింది.

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు లాంటి బస్సులలో శానిటైజేషన్ మాటదేవుడెరుగు రోజు వారి శుబ్రతను కూడా పాటించడం లేదు. గతంలో ప్రతి బస్సులో శానిటైజర్‌ను తప్పనిసరిగా ఉంచిన యాజమాన్యం ఇప్పుడా విషయాన్ని విస్మరించి ప్రవర్తి స్తోంది. శానిటైజర్ బాటిళ్ళను ప్రతి బస్సులో తప్పనిసరిగా ఉంచాలన్న నిబంధ నలను ఎక్కడా పాటించడం లేదు. గతంలో ప్రతి బస్సులో శానిటైజర్బాటిల్ ను ఉంచేందుకు బస్సు ముందు ద్వారం పక్కన ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో ఉంచేవారు, ప్రస్తుతం ఆ బాటిళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది డ్రైవర్, కండక్టర్లు మాస్కలను కూడా వాడటం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే బస్సులలో జనాలే ఎక్కడం లేదని సమాధానం ఇస్తున్నారు. ఉదయం డిపో నుంచి బస్సు బయలుదేరే సమయంలో బస్సును శానిటైజ్ చేశారా లేదా అని పరిశీలించాల్సిన భద్రతాఅధికారులు ప్రస్తుతం పట్టించుకోవడం లేదు.

10 శాతం తగ్గిన ఓఆర్

కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో యాజమాన్యం కనీస జాగ్రత్తలను కూడా పాటించక పోవడంతో బస్సులలో ప్రయాణం చేయడం అంత శ్రేయస్కరం కాదన్న ఉద్దేశ్యంతో చాలా మంది తిరిగి వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా రెండు మాసాల క్రితం ఉన్న ఆక్యుపెన్సీ రేషియే(ఓఆర్) దాదాపుగా 10 శాతానికి తగ్గి రోజుకు రూ. 2 కోట్ల ఆదాయం పడిపోయింది. కరోనా తర్వాత తిరిగి బస్సులను రోడ్డెక్కించిన యాజమాన్యం అనేక చర్యలు
తీసుకుంది. ఫలితంగా ఓఆర్ గణనీయంగా పెరిగింది. రోజు వారి ఆదాయం కూడా దాదాపు రూ. 12 కోట్లకు చేరుకుంది. ఈ ఓఆర్‌ను మరింతగా పెంచుకునేందుకు యాజమాన్యంసిబ్బందికి ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.

- Advertisement -

నిర్ణీతటార్గెట్ ను అధిగమించి ఆదాయాన్ని తెస్తే ఇంటెన్సివ్ ను ఇస్తామని ప్రకటించింది. దీంతో డ్రైవర్, కండక్టర్లు ప్రతి స్టాపులో బస్సును ఆపడంతో పాటు బస్సు ఎక్కడకు వెళ్తుందన్న విషయాన్ని బస్టాప్లోని ప్రయాణికులకు వినిపించేలా చెప్పేవారు. ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్న సమయంలో కరోనా కేసులు పెరగడం, బస్సులలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రయాణికుల ఆధరణ తగ్గుతుందని సిబ్బంది వాపోతున్నారు. నిత్యం ప్రజలతో ఉండే ఆర్టీసీ సిబ్బందికి వెంటనే వ్యాక్సిన్ వేయించాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కొన్ని యూనియన్లు ఈ మేరకు వినతి పత్రం కూడా అందించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement