Tuesday, November 26, 2024

Delhi: ఆ నాలుగు చట్టాలు ఉపసంహరించాలి.. లేదంటే పార్లమెంట్ ముట్టడిస్తామ‌న్న కార్మిక సంఘాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు లబ్జిచేకూర్చే 4 కార్మిక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక-కర్షక సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ఆలిండియా కిసాన్ సభ, సీఐటీయూ, ఆలిండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో ‘మజ్దూర్-కిసాన్ అధికార్ మహాధివేశన్’ జరిగింది. దేశంలోని 24 రాష్ట్రాల నుంచి 6 వేల మంది రైతులు, కార్మిక సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ ఈ సందస్సు ఒక డిక్లరేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని నేతలు ఆరోపించారు.

ఈ సమావేశం అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘా ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కనీస మద్ధతు ధర చట్టాన్ని తీసుకురావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రోజురోజుకూ రైతుల పెట్టుబడి వ్యయం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో చేసిన డిక్లరేషన్‌లోని అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. డిక్లరేషన్‌లో మొత్తం 16 అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని తెలిపారు. సామాజిక-ఆర్థికాంశాలతో పాటు కార్పొరేట్ శక్తులు, మతతత్వ శక్తుల దాడులు, దాష్టీకాలపై కూడా ఈ సదస్సులో చర్చించినట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement