డ్రగ్స్ తరలిస్తూ సినీ నిర్మాత కేపీ చౌదరి అడ్డంగా దొరికిపోయారు. ఆయన అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మందికి గుబులు పట్టుకుంది. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాముల కొకైన్‌ను హైదరాబాద్‌లోని కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ ఈ నెల14వ తేదీన చౌదరి పోలీసులకు దొరికాడు. కాగా, అతడి దగ్గరినుంచి 4 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కాల్ లిస్ట్, వాట్సాప్ చాటింగ్, మెసేజ్‌లను పరిశీలించగా కీలక సమాచారం దొరికినట్టు తెలుస్తోంది.
ఇక.. కేపీ చౌదరి హైదరాబాద్ సిటీలోని ఓ పబ్బులో పార్టీలు నిర్వహిస్తూ, కొకైన్ సప్లయ్ చేసేవాడని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆ పార్టీల్లో పాల్గొన్నవారి జాబితాను తయారుచేసినట్టు తెలిసింది. ఆ జాబితాలో పలువురు ప్రముఖులున్నట్టు, వారికి నోటీసులు కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు సేకరించేందుకు చౌదరి కస్టడీ కోరుతూ రాజేంద్రనగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.
కాగా, చౌదరితో నిరంతర టచ్‌లో ఉన్న నలుగురు హీరోయిన్లు, ఇద్దరు ప్రొడ్యూసర్లపై పోలీసులు మెయిన్‌గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అతడిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపితే ఈ డ్రగ్ దందాకు సంబంధం ఉన్న వారి గుట్టు రట్టయ్యే చాన్సెస్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.