Tuesday, November 26, 2024

ఆ 22 గ‌దులను తెర‌వాలి, తాజ్‌మ‌హ‌ల్‌పై హైకోర్టులో పిటిష‌న్‌.. సీరియ‌స్ అయిన ధ‌ర్మాస‌నం

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ విచారణ జరిపింది. పిటిషనర్‌ ఎలాంటి పరిశోధనా జరపకుండా ఈ పిటిషన్‌ను దాఖలు చేయడంపై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పిటిషన్‌ను కొట్టివేసింది. తాజ్‌ మహల్‌ గురించి పెద్ద చరిత్ర ఉంది. దానిని లోతుగా అధ్యయనం చేసి ఆ తర్వాత పిటిషన్‌ దాఖలుచేయడం సబబుగా ఉంటుందంటూ జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ, జస్టిస్‌ సుభాష్‌ విద్యార్ధిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయోధ్యకు చెందిన డాక్టర్‌ రజనీష్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిఎన్‌ ఓక్‌ అనే చరిత్రకారుడు రాసిన పుస్తకంలో తాజ్‌మహల్‌ని 1212లో పర్మిద్ధి దేవ్‌ అనే రాజు నిర్మించారనీ, దీని అసలు పేరు తేజో మహాలయమనీ, దీని లోపల శివుని ఆలయం ఉందనీ, మూసి ఉంచిన 22 తలుపులను తెరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, దీనిపై నిజనిర్ధారణ కమిటీని నియమించేట్టు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు.

సమాచార హక్కు చట్టం కింద దీని గురించి సమాచారం కోరితే భద్రతా కారణాలరీత్యా తాజ్‌ మహల్‌లోని తలుపులు తెరవడం కుదరదని సమాధానం వచ్చిందని పిటిషనర్‌ తెలిపారు. 22తలుపుల వెనుక ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లోఉందనీ, దానికి కోర్టు వారు సహకరించాలని కోరారు. దానిపై ధర్మాసనం స్పందిస్తూ తాజ్‌ మహల్‌ చరిత్రను అధ్యయనం చేయాలనీ, లోతుగా పరిశోధన చేసిన తర్వాతనే ప్రశ్నలు వేయాలనీ, పసలేని ప్రశ్నలు వేయరాదని పేర్కొంది. అంత ఆసక్తి ఉన్నప్పుడు చరిత్రను పరిశోధించే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement