హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : జనాభాలో దాదాపు 80 శాతానికి పైగా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు రైతులకు పూర్తి ప్రతికూలంగా మారుతున్నాయి. ఖరీఫ్‌లో ప్రధాన పంటలైన వరి, గోదుమ, పప్పు దినుసుల సాగుకు దాదాపు గడువు దాటిపోయింది. గడిచిన దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచే వర్షాలు ఎగనామం పెట్టాయి. ప్రభుత్వ వ్యవసాయ అనుకూల చర్యల కారణంగా ఇన్నాళ్ళూ రాష్ట్రంలో జలవనరులు వ్యవసాయ రంగాభివృద్ధికి దోహదపడ్డాయి.
దేశంలోనే మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణాలో రికార్డు స్థాయిలో 46,531 చెరువులు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అందులో దాదాపు 90శాతానికి పైగా చెరువుల్లో ఇప్పటివరకు కనీస నీటిమట్టం కూడా లేకుండా పోయింది. 27 లక్షలు దాటిన బోరు బావుల్లోనూ ఆశించిన స్థాయిలో నీరు కనిపించడంలేదు. ఆయకట్టు అవసరాలు తీర్చడం అటుంచి కొన్ని చెరువుల్లో పశువులకు తాగునీరు కూడా లేకుండా దుర్భిక్ష పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని రాజకీయ పక్షాలు రైతును అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నాయి తప్ప.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు అటువైపు ఆలోచన కూడా చేయడంలేదు.
ఈ అసాధారణ పరిస్థితుల్లో పంటల సాగుకు మార్గాలెక్కడా కనిపించడం లేదు. ప్రస్తుత ఖరీఫ్ కాలంలో ఇప్పటికే సుమారు 40 రోజులు దాటిపోవడంతో రైతులు అయోమయం చెందుతున్నారు. గత కొన్నేళ్ళుగా జల వనరులు అందుబాటులోకి వచ్చిన కారణంగా రాష్ట్రంలో వరి విస్తీర్ణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రికార్డులను బద్దలుకొట్టి కోటి ఎకరాలు దాటింది. ఫలితంగా ఏటా ధాన్యం దిగుబడి కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల నుచంఇ 2 కోట్ల మెట్రిక్ టన్నుల మధ్యలో ఉండడం తెలంగాణ ప్రతిష్టను చాటింది. కానీ, అన్నపూర్ణగా పేరుతెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది తీవ్రమైన వర్షాభావంతో రైతుల కలలు చెదిరే ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి.
వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం వరిలో దీర్ఘకాలిక రకాల సాగుకు సమయం దాదాపు దాటిపోయింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆయకట్టు రైతులు ఎక్కడా వరి నారుమళ్ళు కూడా వేయలేని దుస్థితి నెలకొంది. ఇక ప్రత్యామ్నాయం స్వల్పకాలిక పంటలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలం సీజన్ మొదలయ్యి 3 వారాలు కావొస్తున్నా ఇంకా రాష్ట్రములో వాన జాడ లేకపోవడంతో వరి సాగు చేసే రైతుల్లో అయోమయం నెలకొంది. నైరుతి రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేసిస్తే నార్లు పోద్దామని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ, గడువు దాటిపోయినందున దీర్ఘ కాలిక రకాలను సాగు చేయవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఒకవేళ ఇప్పటికిప్పుడు వర్షాలు పడినా కానీ .. దీర్ఘకాలిక రకాల సాగు చేస్తే మంచిది కాదని.. మధ్య, స్వల్పకాలిక వరి వంగడాలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రజ్ఞులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఉన్న రైతులు మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారంలోపే వరి నార్లు పోస్తారు. నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా నార్లు పోస్తారు. నాట్లు కూడా అలాగే వేస్తారు. ఈ సీజన్‌లోనూ సాగునీటి లభ్యత ఉన్న కొన్ని ప్రాంతాల్లో నార్లు పోశారు. కానీ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ఇంకా రాకపోవటంతో.. బోర్లు, బావుల కింద నార్లు పోసిన రైతులు కూడా నాట్లు- వేసేందుకు ఆలోచిస్తున్నారు.
ఇదిలా ఉండగా వానాకాలం సాగు సీజన్ మొదలై దాదాపు 5 వారాలు అవుతుంది. ఒకవేళ ఈ రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించి, వర్షాలు పడినప్పటికీ.. వెంటనే నార్లు పోయడం సాధ్యం కాదు. ఈ ఏడాది మండుటెండల నేపథ్యంలో విపరీతమైన ఉష్ణోగ్రతలతో భూమి వేడెక్కింది. కనీసం వారం పాటు వానలు పడితే తప్ప భూమి చల్లబడే పరిస్థితి లేదు. భూతాపం తగ్గిన తర్వాతే రైతులు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నైరుతి రాక ఆలస్యమైన నేపథ్యంలో జూలై ఒకటి నుంచి సాగుకు శ్రీకారం చుట్టాల్సివస్తే.. దీర్ఘకాలిక వంగడాల సాగు శ్రేయస్కరం కాదని చెబుతున్నారు. దీర్ఘకాలిక వంగడాల పంట కాలపరిమితి కనీసం 150-165 రోజులు ఉంటుంది. విత్తనాలు చల్లి, నారు చేతికి రావాలంటే నెల పడుతుంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక రకాల జోలికి పోవద్దని, ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో సాగుచేస్తే, దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
అయితే వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు.. డ్రమ్ సీడర్‌తో విత్తనాలు వేసే రైతులకు మాత్రం కాస్త అవకాశం ఉంది. దీర్ఘకాలిక రకాల సాగుకు కటాఫ్ తేదీ జూన్ 15 కాగా.. మధ్యకాలిక రకాల సాగుకు జూన్ మూడు, నాలుగో వారం వరకు అవకాశం ఉంటుంది. జూలై ఒకటి వరకు వెళ్తే.. స్వల్పకాలిక రకాలు సాగుచేయాల్సిందే. స్వల్పకాలిక రకాలు సాగుచేస్తే 115 రోజుల నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇందులో తెలంగాణ సోనా, జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, ఎంటీయూ- 1001 రకాలను సాగు చేస్తే బాగుంటుందని శాస్త్రవేత్తలు సూచించడంతో పాటు నష్టపోకుండా ఉండేందుకు చిన్న, సన్నకారు రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.
కౌలు రైతులది మరో ఘోష?
రాష్ట్రంలో కౌలు రైతుల జీవనం రోజురోజుకు అగమ్యగోచరంగా మారుతోంది. భూమిని నమ్ముకొని బతుకుతున్న కౌలు రైతులు ఏటా కౌలు ధరల పెంపుతో బేజారవుతున్నారు. ఈ సారి కూడా కౌలు ధరలు పెరిగిపోయాయి. జిల్లాల్లో ఒకవైపు యాసంగి కోతలు సాగుతుండగానే మరోవైపు కౌలు ఒప్పందాల హడావుడి మొదలైంది. నీటి వసతిని బట్టి కౌలు ధరలు పెరుగుతూ పోతుండడంతో కౌలును నమ్ముకున్న రైతులు దిక్కుతోచక పట్టాదారలు చెప్పినట్లు-గా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అనదికారిక లుక్కల ప్రకారం ఒక్కో జిల్లాలో దాదాపు 80 వేల నుంచి లక్షా 20వేల వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరికి రైతుబంధు, బ్యాంక్ అప్పులు దొరకని పరిస్థితి. దీంతో పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. మరోవైపు కౌలు ధరను కూడా పట్టాదారులు పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు ఎకరానికి సరాసరిగా రూ.6 నుంచి రూ.12వేల వరకు కౌలు ధర పెంచారు.
ఒక వర్షాభావం, మరోవైపు కౌలు ధరలతో అయోమయం
పరివాహక జిల్లాల్లో కాళేశ్వరం జలాలు రావడం, 24 గంటల కరెంట్, మిడ్ మానేరు, అనంతారం ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయడం, ఎత్తిపోతల ద్వారా చెరువుల్లో నీళ్లు నింపడం, వర్షాలు ఆశాజనకంగా కురవడం, భూగర్భ జలాలు పెరగడం వంటివాటితో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ప్రతియేటా వానాకాలం సీజన్‌లో లక్షలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి కూడా కౌలు ధరలు, ఒప్పందాలు మారుతున్నాయి. పత్తి ఒకే పంట వస్తుండడంతో ఒకే రేటు ఉండగా వరి, ఇతర పంటలకు సంబంధించి వానాకాలం, యాసంగి పంటకు కలిపి కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ఎకరానికి నీటి వసతి తక్కువగా ఉంటే రూ.8 వేల నుంచి రూ.15వేల వరకు, సమృద్ధిగా నీరు ఉంటే రూ.15 నుంచి రూ.20వేల వరకు కౌలు ధర నడుస్తోంది. ఒక ఎకరంలోపు సాగు భూములు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా సరాసరిగా 38 లక్షల మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వీరిలో గరిష్ట సంఖ్యలో తోటి రైతుల వద్ద మరో 2 నుంచి 5 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వీరితోపాటు- ఒక్కో జిల్లాలో సుమారుగా 15వేల నుంచి 20వేల వరకు ఎలాంటి భూములూ లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కౌలు భూములపైనే బతుకుతున్నారు.