వినాయక చవితి పండుగ అంటే.. పూలు పండ్లు.. పత్రితోనే పూజలు.. అయినా ఈసారి కూడా నిలువేళ్లా రసాయనాలతో కూడిన వినాయకుల విగ్రహాలే రాష్ట్రంలో ఎక్కువగా కొలువు తీరాయి. మట్టి ప్రతిమలపై అంతగా ప్రచారం లేక పోవడంతో భక్తులు పీఓపీ విగ్రహాలనే పూజించారు. కొన్నేళ్లుగా మట్టి వినాయకులను పూజించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. గతంలో కంటే కొంత పరిస్థితి మెరుగైనా ఇంకా పీఓపీ ప్రతిమలు, విగ్రహాలే దర్శనమిస్తున్నాయి. ఇంకా ప్రజల్లో చైతన్యం పెరగాలి, మట్టి గణపతులనే పూజించాలి. ఇండ్లలో పూజలు చేసే వారు మాత్రం కొంతమేర మట్టి గణపతులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఏడు కొవిడ్ తీవ్రత తక్కువగా ఉండడంతో వినాయక మండపాలు విరివిగా వెలిశాయి. ఘణనాధునికి భక్తులు బక్తి శ్రద్దలతో పూజలు చేశారు.
ఘనంగా సంబురాలు…
మేడ్చల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారు. ఐదు అడుగుల నుంచి 10 అడుగుల వరకు వివిద ఆకారాల్లో గణనాధులను కొలువులు దీర్చారు. ఎక్కడ చూసినా విబిన్న రూపాల్లో కలర్ ఫుల్‌గా లంబోధరులు కనువిందు చేస్తున్నాడు. ఈ మండపాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టి పడేలా గణనాధులను మండపాల్లో కొలవులు దీర్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరు అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా జరుపుకొనే పండుగ వినాయకచవితి. విఘ్నాలకు అధిపతి వినాయకుడు కావడంతో ఈ పండుగను జనం ఎంతో బక్తిశ్రద్దలతో జరుపుకొంటారు. మండపాల్లో గణపతి ప్రతిమను ఏర్పాటు చేసిన నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపు కోవడం ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత. ప్రతి ఏడాది వినాయ పందిళ్ల ఏర్పాటు పెరుగుతూనే ఉన్నాయి.