జాతీయ రాజకీయాల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికున్న ప్రాధాన్యత, ప్రభావం మరే ఇతర రాష్ట్రానికి లేదంటే అతిశయోక్తి కాదు. యూపీని గెలిచినవారే ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తారన్న రాజకీయ నానుడి కూడా తెలిసిందే. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించకముందు నుంచే ఇక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే షెడ్యూల్ విడుదలైన తర్వాత శరవేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బీజేపీని దెబ్బకొట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అధికార యోగీ సర్కారులో కీలక మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి రాజీనామా చేసి, అఖిలేశ్ చెంత చేరడం కమలదళంలో గుబులు పుట్టిస్తోంది. ఆయనొక్కడే కదా అనుకునేలోపు, ఆయన వర్గీయులుగా చెప్పుకునే మరో నలుగురు ఎమ్మెల్యేలు రోషల్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్య రాజీనామాలు చేసి మరింత కలకలం సృష్టించారు.
ఓబీసీ ఓటుబ్యాంకుకు గండి..
యాదవులు, మైనారిటీలు సాంప్రదాయ ఓటర్లైన సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న ఇతర ఓబీసీ కులాలపై గురిపెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఓబీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ఓబీసీ వర్గానికి చెందిన నేత అన్న విషయాన్ని కమలనాథులు ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా గత ఏడాది జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనూ అత్యధికంగా 27 మంది ఓబీసీలకు చోటు కల్పించిన విషయాన్ని కుడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అలాగే పార్టీ అనుబంధ విభాగం ఓబీసీ మోర్చా గత కొన్నాళ్లుగా ఉత్తర్ ప్రదేశ్‌లోనే తిష్ట వేసిన విషయం తెలిసిందే. అగ్రవర్ణాలు సాంప్రదాయ ఓటుబ్యాంకుగా కల్గిన బీజేపీ, కేవలం అగ్రవర్ణాల ఓట్లతోనే గెలుపు పీఠంపై కూర్చోవడం సాధ్యంకాదని గ్రహించింది కాబట్టి అధిక సంఖ్యాక ఓబీసీ కులాల ఓట్ల కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో వారికి ప్రధాన ప్రత్యర్థిగా మారిన అఖిలేశ్ యాదవ్, కమలనాథులకు ఝలక్ ఇస్తూ ఓబీసీ ఓట్లకు గండికొట్టే ఎత్తుగడ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓబీసీల్లో గట్టి పట్టున్న స్వామి ప్రసాద్ మౌర్యను తన గూట్లో చేర్చుకున్నారు.
‘యోగి’పై పార్టీ నేతల్లో అసంతృప్తి.. బీజేపీ ప్రతికూలంగా మారిన పరిస్థితి
5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్వామి ప్రసాద్ మౌర్య 2016లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆయనతో పాటు పార్టీని వీడినవారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బీఎస్పీ నుంచి బీజేపీలో చేరినవారే. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మౌర్య మంత్రి పదవి చేపట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికలు సహా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అనేక ఓబీసీ వర్గాలను బీజేపీవైపు ఆకర్షితులను చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే రాజీనామాకు ముందు కొన్ని నెలల క్రితం మౌర్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. అయినా సరే పరిస్థితిలో మార్పు రాకపోవడంతోనే రాజీనామా చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
పరస్పర వైరుధ్యం కల్గిన సిద్ధాంతాలు కల్గిన బీజేపీలో ఉన్నప్పటికీ, తాను పూర్తి అంకితభావం, చిత్తశుద్దితో పనిచేశానని, కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుగ్యోగులు, చిరు వ్యాపారులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ తాను పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తన నిష్క్రమణ ప్రభావం పార్టీపై ఎంత ఉంటుందో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని మౌర్య నిష్క్రమణ బహిర్గతం చేసింది. ఓబీసీల్లో ప్రభావవంతమైన నేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ 2019లో బీజేపీకి దూరమైన విషయం తెలిసిందే. సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేతైన రాజ్‌భర్, బీజేపీతో కలిసి 2017 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో వెనుకబడినవర్గాల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే మిత్రపక్షంగా ఉంటూ మిత్రధర్మానికి విఘాతం కల్గించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ యోగి ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించారు.
దిద్దు’బాట’లో అగ్రనాయకత్వం..
స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా, ఆ వెంటనే అఖిలేశ్ చెంత చేరడంతో ఖంగుతిన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం, తక్షణమే దిద్దుబాట చర్యలు చేపట్టినట్టు తెలిసింది. పార్టీ వీడిన మౌర్య, అతని అనుచర ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అప్పగించినట్టు తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు యూపీ బీజేపీలోని కొందరు ముఖ్యనేతలు హడావుడిగా ఢిల్లీ చేరుకున్నారు. మౌర్య నిష్క్రమణ నేపథ్యంలో పరిస్థితులపై ఆయనతో చర్చించారు.
ఇదిలా స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాపై కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ “ఆయనెందుకు రాజీనామా చేశారో తెలియదు. కానీ పార్టీని వీడొద్దని నేను ఆయన్ను కోరుతున్నాను. ఏదున్నా కలిసి కూర్చుని చర్చించుకుందాం. హడావుడిగా తీసుకునే తొందరపాటు నిర్ణయాలు తిప్పికొడతాయి” అన్నారు. దీనిపై స్వామి ప్రసాద్ స్పందిస్తూ “ఈ మాట ఆయన ముందే ఎందుకు చెప్పలేదు? ఆయనకు నేను ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాను? ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. నిజానికి చర్చ అవసరమైనప్పుడు వారి దగ్గర చర్చించడానికి సమయమే లేదు” అంటూ విమర్శించారు.
ప్రతిపక్షంలో నూతనోత్తేజం..
బీజేపీకి ఝలక్ ఇస్తూ స్వామి ప్రసాద్ మౌర్య తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష కూటమిలో నూతనోత్తేజాన్ని నింపింది. మౌర్య తన వెంట మరో డజను మంది నేతలను వెంట తీసుకొస్తారంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ప్రచారం చేయడంపై ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో మార్పు కనిపిస్తోందని, మౌర్యతో పాటు మరో 13 మంది వెంట నడుస్తారని ఆయనన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది బీజేపీని వీడతారని ఆయన జోస్యం చెప్పారు. మొత్తంగా సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో శరవేగంగా మారుతున్న పరిణామాలు ప్రతిపక్షంలో కొత్త ఊపు తెస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి సరికొత్త సమీకరణాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital