బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల కలకలంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాల్పులు జరిపింది మేమే అంటూ గ్యాంగ్ స్టర్ ఆన్మోల్ బిష్ణోయ్ ప్రకటించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సల్మాన్ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మాబలమేంటో నీకు అర్దమై ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈసారి తుపాకీ పేలుడు ఇంటిబయట ఆగదు అంటూ హెచ్చరిక జారీ చేసాడు.
అన్మోల్ భారత్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్రస్తుతం అతడు యుఎస్‌లో దాక్కున్నాడు. సల్మాన్ కి గత కొంతకాలంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కుంటోన్నాడు. లేఖల రూపంలో.. ఈమెయిల్స్ రూపంలో చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు సల్మాన్ కి భద్రత మరింత పటిష్టం చేసారు. తాజా ఘటనతో మరోసారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రభుత్వ సెక్యురిటీ కాకుండా సల్మాన్ వ్యక్తిగత సిబ్బందిని కూడా నియమించుకున్నారు. ఆయన వెంట ఎప్పుడు బాడీ గార్డులుంటారు. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పరారీలో ఉన్న నిందితుడు. అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి పారిపోయాడని గత సంవత్సరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ వేసింది. సల్మాన్ ఖాన్ తమ అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు కూడా విధించారు.