దేశీయ స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల సందడి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ ముద్ర లిమిటెడ్ ఐపీఓగా వచ్చేందుకు నిర్ణయించింది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.243 నుంచి రూ.256గా ప్రకటించింది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ప్రొవైడర్‌గా ఈ ముద్ర అందరికీ పరిచయం. ఈ కంపెనీ కస్టమర్ల జాబితాలో ఇన్ఫోసిస్, టీసీఎస్, మష్రెక్ బ్యాంక్, బాడ్ టెలికాం కంపెనీ, చోలమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, భారతీ ఏఎక్స్‌ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. రూ.413 కోట్లు సమీకరణ లక్ష్యంగా ఐపీఓగా వచ్చేందుకు నిర్ణయించినట్టు కంపెనీ వివరించింది. మే 20న ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. మే 24తో ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లు మే 19 నుంచే బిడ్లు దాఖలు చేసే అవకాశాన్ని కల్పించింది.
పబ్లిక్ ఇష్యూలో సగం షేర్లను అర్హతగల వ్యవస్థాపక మదుపర్లకు, 35 శాతం రిటైల్ మదుపర్లు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు కేటాయించారు. తాజా షేర్ల ద్వారా.. రూ.161 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 98.35 లక్షల షేర్లను అందుబాటులోకి ఉంచుతున్నది. గరిష్ట ధర వద్ద రూ.412.79 కోట్లు సమకూరనున్నాయి. ఇలా సమకూర్చిన నిధులతో.. రుణ చెల్లింపులు, మూల ధన అవసరాలు, డేటా సెంటర్ల స్థాపనకు కావాల్సిన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు కేటాయించనున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ రంగంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 37.9 శాతం ఉంది. వివిధ రంగాల్లో పని చేస్తున్న పరిశ్రమలు, కంపెనీలకు ఈ సంస్థ డిజిటల్ ట్రస్ట్ సేవలు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..