Tuesday, November 19, 2024

కోరిక తీరిస్తే, ఖర్చు భరిస్తానన్నారు.. బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌ఐఆర్ ఇదే..

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ బ్రిజ్‌భూషణ్‌పై నమోదైన కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ వివరాలు వెలుగుచూశాయి. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక ప్రయోజనాలను డిమాండ్‌ చేశారని, ఆయనపై 10 వేధింపుల ఫిర్యాదులు కూడా నమోదయ్యాయని తెలిపింది. మహిళా రెజ్లర్లను అనుచితంగా తాకడం, వారి ఛాతీపై చేయి వేయడం, వారిని వెంబడించడం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రెజ్లర్లు ఏప్రిల్‌ 21న ఫిర్యాదు చేస్తే, అదే నెల 28న రెండు ఎఫ్‌ ఐఆర్‌ లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. 354, 354(ఎ), 354(డి), 34 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ పై ఓ మహిళా రెజ్లర్‌ చేసిన ఆరోపణ ప్రధానంగా వినిపిస్తోంది. విదేశాలలో జరిగిన పోటీల్లో తాను గాయపడిన సందర్భంలో బ్రిజ్‌ భూషణ్‌ తనతో అసభ్యంగా మాట్లాడారని సదరు రెజ్లర్‌ ఆరోపించింది.

తన కోరిక తీరిస్తే ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు మొత్తం ఫెడరేషన్‌ భరించేలా చూస్తానని చెప్పాడన్నారు. బ్రిజ్‌ భూషణ్‌కు భయపడి వీలైనంత వరకు తమ గదులలో నుంచి బయటకు రావడం మానేశామని రెజ్లర్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే నలుగురు ఐదుగురం కలిసి వచ్చేవారమని వివరించారు. అయినా కూడా తమలో నుంచి ఒకరిని పక్కకు తీసుకెళ్లి అసభ్యంగా మాట్లాడేవారని చెప్పారు. కోచ్‌ లేని సమయంలో వచ్చి తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని అన్నారు. ఒకసారి తన టీషర్ట్‌ లాగారని, ఛాతీ, పొట్టపై అభ్యంతరకరంగా తాకారని మరో రెజ్లర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్వాసక్రియ పరీక్షిస్తానంటూ బ్రిజ్‌భూషణ్‌ తన దుస్తులను లాగాడని ఓ మహిళా రెజ్లర్‌ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.

ఛాతీని, పొట్టను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. కోచ్‌ లేని సమయంలో భూషణ్‌ తమను వేధించేవాడని మరో బాధితురాలు ఆరోపించింది. కోచ్‌ పరీక్షించని పదార్థాలను తినమని చెప్పేవాడని తెలిపింది. ఓ అంతర్జాతీయ పోటీలో గాయపడినప్పుడు.. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులను ఫెడరేషన్‌ భరించేలా చేస్తానని బ్రిజ్‌ భూషణ్‌ అన్నట్లు మరో రెజ్లర్‌ ఆరోపించింది. ఫొటో తీసుకుందామంటూ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని మరో రెజ్లర్‌ ఆవేదన వ్యక్తం చేసింది. రెజ్లింగ్‌ సమాఖ్య సెక్రటరీ వినోద్‌ తోమర్‌పైనా ఓ రెజ్లర్‌ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌ ద్వారా తెలిసింది.

- Advertisement -

బ్రిజ్‌ భూషణ్‌కు షాక్‌..

మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బ్రిజ్‌ భూషణ్‌ తలపెట్టిన మహా ర్యాలీకి జిల్లా యంత్రాంగం అనుమతి తిరస్కరించింది. జూన్‌ 5న ర్యాలీ జరగాల్సి ఉండగా.. అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అదే రోజు జిల్లాలో వివిధ కార్యక్రమాలు ఉన్నాయని అయోధ్య సర్కిల్‌ అధికారి ఎస్‌పీ గౌతమ్‌ తెలిపారు. అందుకే ర్యాలీకి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే, రెజ్లర్ల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన ర్యాలీని కొద్దిరోజులు వాయిదా వేసుకుంటున్నట్లు బ్రిజ్‌ భూషణ్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement