న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశం పేరు మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ‘ఇండియా’ బదులుగా ఇక నుంచి ‘భారత్’ పేరుతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. జీ-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో దేశ రాజధానికి విచ్చేస్తున్న వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపిన ఆహ్వాన పత్రంలో “ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా” అని ఉండాల్సిన చోట “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని పేర్కొన్నారు.
దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా సహా ప్రతిపక్ష కూటమి ‘ఐ.ఎన్.డీ.ఐ.ఏ’ నుంచి పలువురు స్పందించారు. రాజ్యాంగంలోని మొదటి అధికరణలో దేశం పేరును నిర్వచించే చోట “ఇండియా, దట్ ఈజ్ భారత్, షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్” అని ఉన్న చోట ఇక నుంచి “భారత్, దట్ వజ్ ఇండియా, షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్” అని చదువుకోవాలేమో అంటూ వ్యంగ్యం ధ్వనించేలా జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
ఇక రాఘవ్ చద్దా ఏకంగా “ఇండియా పేరును ఎలా తొలగిస్తారు?” అంటూ ఓ ట్వీట్లో ప్రశ్నించారు. ఈ దేశం ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదని, 135 కోట్ల దేశ ప్రజలది అని పేర్కొన్నారు. దేశ గుర్తింపు బీజేపీ సొంత ఆస్తి కాదని, తన ఇష్టం వచ్చినట్టు పేర్ల మార్పు తగదని రాశారు. విపక్ష నేతల స్పందనను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రాజ్యాంగంలోని మొదటి అధికరణంలోనే ‘భారత్’ అని రాసి ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎన్. రమేశ్ నాయుడు గుర్తుచేశారు.
భరతుడు పాలించిన దేశం కాబట్టి భారతదేశం అని పిలుస్తున్నామని, వేదమంత్రాల్లోనూ భరతవర్షే.. భరతఖండే అంటూ పేర్కొన్నారని గుర్తుచేశారు. పాఠశాలల్లో ఉదయం పిల్లలతో చేయించే ప్రతిజ్ఞలో కూడా “భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు” అని ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని భారత్ అంటే తప్పేంటని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. బ్రిటీష్ పాలన కంటే ముందు హిందుస్థాన్, భారత్ అంటూ వ్యవహరించేవారని అన్నారు.
విదేశీయులు స్థాపించిన పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీలో నేతల నుంచి అంతకంటే ఇంకే ఆశిస్తామని కాంగ్రెస్‌ను ఉద్దేశించి రమేశ్ నాయుడు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నామని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశం పేరు మార్పును స్వాగతించాలని హితవు పలికారు. కూటమి పేరును ఇండియా అని అర్థం వచ్చేలా పెట్టుకుంటే సరిపోదని, ఆ కూటమిలో భారతీయ ఆత్మ లేదని విమర్శించారు. దేశం పేరు మార్పు విషయంలో వారి స్పందన చూస్తుంటే అదే నిజమని స్పష్టమైందని అన్నారు.