క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇవ్వాల (బుధవారం) షెడ్యూల్ విడుదల చేసింది. టోర్నీ ఆగస్టు 30న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. టోర్నీలో అత్యంత ముఖ్యమైన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీ వేధికగా జరగనుంది.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఈ టోర్నీలో మొత్తం 6 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఆయా గ్రూపుల్లోని టాప్ 2 జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో టాప్ 2 జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్ దశలో భారత జట్టు పాకిస్థాన్‌తో పాటు నేపాల్‌తోనూ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 4న భారత జట్టు నేపాల్‌తో తలపడనుంది. అంతా ప్లాన్ ప్రకారం జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ తో 3 సార్లు తలపడే అవకాశాలున్నాయి. ఈ 2 జట్లు లీగ్ దశ, సూపర్ 4, ఫైనల్లో తలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆగస్టు 30న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్‌లో జరగనుంది. గ్రూప్ స్టేజ్ పోటీలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు.. సూపర్ 4 పోటీలు సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు జరుగుతాయి. సెప్టెంబర్ 17న శ్రీలంకలోని కొలంబోలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది.
ప్రపంచకప్‌కు ముందు జరగనున్న ఆసియాకప్ ఈసారి వన్డే ఫార్మాట్లో జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్‌లు ఈసారి హైబ్రిడ్ ఫార్మాట్లో ఆసియా కప్‌ను నిర్వహించనున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో 9 మ్యాచ్‌లు శ్రీలంకలో, 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.