Sunday, October 6, 2024

TG | ఇది పదేళ్ళ భావోద్వేగం : రేవంత్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రత్యేక రాష్ట్రం వస్తే.. తమకు మేలు జరుగుతుందని, ఉద్యోగావకాశాలు వస్తాయని ఆశించి భంగపాటుకు గురైన నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని, ‘ప్రజా పాలన’ నిర్ణయాలు ఆ దిశగానే ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. వెనకడుగు వేయబోనని ప్రకటించారు. గత ప్రభుత్వంలో పదేళ్ళ పాటు ఇష్టారాజ్యపు నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా సామాజికంగా.. అన్ని రకాలుగా దివాలా తీసినప్పటికీ, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా ప్రజాపాలన కొనసాగుతోందని తెలిపారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. భవిష్యత్తులోనూ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో నూతనంగా ఎంపికైన 1635 మంది వివిధ కేటగిరీ ఉద్యోగులకు ఆదివారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. భావోద్వేగం.. సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, ప్రజల ఆకాంక్ష మేరకు మేలు జరగాలి ఆకాంక్షించారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

”వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన గత ప్రభుత్వం ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి. నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ మోగించిన నాడు. వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పా.

- Advertisement -

మా మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90రోజుల్లోనే మేం ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నాం.

1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉంది. మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుంది. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోంది. వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడింది.

అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ఇది భావోద్వేగం. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లక్షలాది మంది హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలి.

హైదరాబాద్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయి. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో.. నాగార్జున సాగర్‌ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి” అని సీఎం రేవంత్‌ భావోధ్వేగ ప్రసంగం చేశారు.

ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి..

”ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్‌.. 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్‌ కవచంగా మార్చుకున్నారు.

ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అక్టోబర్‌ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి.. ఇది మా బాధ్యత. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని మేం నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ చేతుల మీదుగా మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ జరగబోతుంది.

మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? మూసీ పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం. ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వండి. ఈటెల అంగి మారింది కానీ.. వాసన మారలేదు. హరీష్‌, కేటీఆర్‌ మాట్లాడిందే ఈటెల మాట్లాడుతున్నారు. ఈటెల ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలి” అని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు.

ఏం చేద్దామో.. మీరే చెప్పండి? ప్రతిపక్షాలకు సీఎం సూటి ప్రశ్న ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు చిచ్చు పెట్టే ప్రయత్నాలను మానుకోవాలని సీఎం రేవంత్‌ సూచించారు. నిర్వాసితులకు మరింత మెరుగైన సాయం అందించేందుకు ఏం చేద్దామో.. మీరే చెప్పండి? అంటూ ప్రశ్నించారు.

మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ముందుకే వెళతామమని మరోసారి స్పష్టం చేశారు. మూసీ నది ప్రక్షాళన చేయాలనుకుంటు-న్నామని.. ఎవరు అడ్డుపడినా ప్రాజెక్టు ఆగదని స్పష్టం చేశారు. మురికిలో కూరుకుపోయిన మూసీ నదిని ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదని ప్రశ్నించారు.

మూసీ బాధితులంతా మురికిలోనే బతకాలా? వాళ్ల జీవితాలు బాగుపడొద్దా? అని సీఎం రేవంత్‌ నిలదీశారు. రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాగా ప్రభుత్వం గురించిన మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు సర్వే చేశారని.. నిర్వాసితులను ఒప్పించే ఖాళీ చేయిస్తున్నారని సీఎం రేవంత్‌ తెలిపారు.

విలువైన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై సలహాలు ఇవ్వకుండా.. విమర్శలు చేయడం ఏంటని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 20 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. తనకు పేదోడి బాధ తెలియదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసిందని.. మరో రూ. 10 వేల కోట్లు అప్పు చేసి మూసీ బాధితులను ఆదుకోలేమా? అని రేవంత్‌ నిలదీశారు.

తప్పకుండా మూసీ మంచి చోట ఆశ్రయం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మీరు చేసిన అవినీతిని ఆపితే పేదలను ఆదుకోవచ్చని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. ఎంపీ ఈటల రాజేందర్‌ చొక్కా మార్చాడు కానీ.. ఇంకా పాత అంగీ వాసన పోలేదన్నారు రేవంత్‌. బీఆర్‌ఎస్‌ అడుగుజాడల్లోనే ఇంకా ఈటల నడుస్తున్నారని విమర్శించారు.

ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, గంధమల్ల రిజర్వాయర్లలో ఎవరి భూములు పోలేదా? అని రేవంత్‌ నిలదీశారు. మల్లన్న సాగర్‌ కింద రైతులను కొట్టి, బలవంతంగా ఖాళీ చేయించారన్నారు.

మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్న కేసీఆర్‌ కుటుంబం వాళ్ల కోసం ఏమైనా చేసిందా? అని రేవంత్‌ ప్రశ్నించారు. పేదలను రెచ్చగొట్టకుండా.. మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుందామా అని సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌ ప్రతిపక్షాలకు హితవు పలికారు.

మరోవైపు, కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు రేవంత్‌. కాళేశ్వరం కేసీఆరే కట్టారు..ఆయన కళ్ల ముందే కూలిందన్నారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు డీపీఆర్‌ లేదన్నారు. లక్షా 50 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు కట్టారన్నారు. మల్లన్నసాగర్‌ లో 50 టీఎంసీలు నింపితే కూలిపోతుందని..నిపుణుల కమిటీ తేల్చిందని సీఎం రేవంత్‌ తెలిపారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి మూసీ ప్రక్షాళన అవశ్యం

మరోసారి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. మూసీ దగ్గర పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలా? అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ లక్ష కోట్లను కాళేశ్వరం కోసం తగలబెట్టగా లేనిది.. మూసీ పేదల కోసం రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టకూడదా అని ఆయన ప్రశ్నించారు.

”వందేళ్ల అభివృద్ధి ఒకవైపు ఉంటే, దుర్గంధం మరోవైపు ఉంది. మూసీ పేదల్ని తరలించవద్దు అనడం ద్వారా.. కేసీఆర్‌కి ఉన్న ముసుగు తొలగిపోయింది. సబర్మతి రివర్‌ ఫ్రంట్‌లో 64వేల కుటుంబాలను తరలించారు. ప్రధాని మోదీని అడిగితే మనీ ఇస్తారు, కేసీఆర్‌ నాతో ఢిల్లీకి రావాలి. ఇద్దరం కలిసి అడుగుతాం.

బాధ్యతా రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పుపడుతున్నారు. తెలంగాణ బాగుపడితే, తమ దోపిడీ బయటపడుతుందనే ఇలా చేస్తున్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు మాట్లాడితే తమపై నుంచి బుల్డోజర్లను పోనివ్వాలని అంటున్నారు. మీ కోసం బుల్డోజర్లు కొనాలా? అదో అదనపు ఖర్చా? క్యాట్‌ వాక్‌ కాదు.. వెళ్లి మూసీ దగ్గర ఓ వారం ఉండాలి.. అప్పుడు తెలుస్తుంది పేదల బాధలేంటో”.. అని సీఎం రేవంత్‌ సెటైర్‌ వేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, కె.కేశవరావు, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement