Thursday, November 21, 2024

ఇది సామాన్యుడి బడ్జెట్ కాదు.. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ ఊహగానే మిగిలింది: రంజిత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులు, రైతులు, నిరుపేదలకు మంచి చేసేదిగా లేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి లోక్‌సభలో బడ్జెప్‌పై చర్చలో భాగంగా మాట్లాడిన ఆయన ఈ బడ్జెట్‌తో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఉహాగానే మిగిలిందని అన్నారు. 100 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ కాదని, తమ సీఎం కేసీయార్ చెప్పినట్టు ఇదొక గోల్ మాల్ బడ్జెట్ అని విమర్శించారు. ఆహార రంగంలోని కొన్ని వస్తువులపై పన్నులు పెంచి వజ్రాలపై తగ్గించారని గుర్తుచేస్తూ, ఇదెలా సామాన్య, మధ్యతరగతి వర్గాల బడ్జెట్ అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు.

ఆరోగ్య రంగం, గ్రామీణ ఉపాధి హామీ పథకాలకు నిధులు తగ్గించారని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో 38 నుంచి 40 కోట్ల జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు ఈ బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులు కేవలం రూ. 12,800 కోట్లు మాత్రమేనని అన్నారు. అంటే ఒక్కో కుటుంబానికి, ఏడాదికి రూ.330, నెలకు రూ. 25-30 కేటాయించారని లెక్కలు చెప్పారు. ఈ డబ్బుతో ఏం చేయమంటారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంను ఉదాహరణ తీసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో 88 లక్షల జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు రూ. 33,611 కోట్ల సబ్ ప్లాన్ అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో పాటుగా ‘దళిత బంధు’ పథకాన్ని కొత్తగా తీసుకొచ్చి, ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఇస్తున్నామని అన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

దేశంలో 70 కోట్ల ఓబీసీలు ఉంటే రూ.1400 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం మీద మాట్లాడడానికి సమయం లేదని, రూ.35,000 కోట్ల ఎరువుల సబ్సిడీ తగ్గించారని మండిపడ్డారు. కనీస మద్ధతు ధరతో పాటు ధాన్యం సేకరణపై పాలసీ ప్రకటించాలని కేంద్రానికి రంజిత్ రెడ్డి సూచించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని,

ఇప్పుడు పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు. ఒక వైపు వ్యవసాయ రంగంపై కోవిడ్ ప్రభావం లేదని చెప్తున్నారని, మరోవైపు వారి ఆదాయం రెట్టింపు కాలేదు అంటూ పరస్పర భిన్నవాదనలు వినిపిస్తున్నారని అన్నారు. ధాన్యం సేకరణలో భారత ఆహార సంస్థకు, కేంద్ర ప్రభుత్వానికి సమన్వయం లేదని ఆరోపించారు.

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ, ఏ అంశంలో చూసినా మొదటి స్థానంలో నిలిచిందని రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో అనేక అవార్డులు వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య, రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతాం, చర్చిద్దాం అన్న ప్రధాని మాటలను గుర్తుచేస్తూ, తామూ అదే కోరుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరు దేశం అభివృద్ధి చెందాలనే కోరుకుంటారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాన్ని పొగుడుతున్నారని, కానీ ప్రధానమంత్రి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందున అభినందిచడం లేదని అన్నారు. ఐటి పరిశ్రమ అద్భుతమైన ప్రగతిలో ఉన్న తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ అడిగినప్పటికీ ఇవ్వలేదని అన్నారు.

- Advertisement -

తన పార్లమెంట్ నియోజకవర్గంలో తెలంగాణ వ్యక్తి యుగంధర్ రెడ్డి వేల కోట్లతో ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ స్థాపించారని రంజిత్ రెడ్డి తెలిపారు. రైల్వే శాఖను అడిగితే కోచ్ ఫ్యాక్టరీ అనుకూలం కాదని చెప్పారని, కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి స్థాపించారని అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, తాము రూ.83,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. దానికి జాతీయ హోదా అడుగుతున్నామని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ జిఎస్డీపి 4.5 లక్షల కోట్లు ఉండగా, అదిప్పుడు 9.8 లక్షల కోట్లకు చేరుకుందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక వృద్ధి 93% పెరిగితే, ఏడేళ్లలో గుజరాత్ వృద్ధి 80% మాత్రమేనని గణాంకాలతో పోల్చి చెప్పారు. తలసరి ఆదాయం 1.24లక్షల నుంచి 2.37 లక్షలకు పెరిగిందని, దేశంలోనే ఇది అత్యధికమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నందుకు సంతోషంగా ఉందని రంజిత్ రెడ్డి అన్నారు. కర్ణాటక రాష్ట్రం మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మీ, టి హబ్ పథకాలను కాపీ కొట్టిందని, రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని అన్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ, మిషన్ భగీరథను కాపీ కొట్టిందని అన్నారు. ఆసరా పెన్షన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించాలని రంజిత్ రెడ్డి సభలో కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement