Thursday, October 31, 2024

Delhi: ఇది సీబీఐ కస్టడీ కాదు – బీజేపీ కస్టడీ! – క‌విత

వాళ్లు మాట్లాడిందే.. అధికారులు ప్రశ్నిస్తున్నారు
కొత్తగా వీళ్లు అడిగిందేమీ లేదు
రౌస్​ అవెన్యూ కోర్టు వద్ద మీడియాతో కవిత
ముగిసిన సీబీఐ కస్టడీ.. 23వరకు వాయిదా
నిన్న రాత్రి సోద‌రి క‌విత‌తో కేటీఆర్ భేటీ

న్యూఢిల్లీ – లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు, రౌస్‌ అవెన్యూ కోర్టు ఈనెల 23వరకు జూడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమ‌వారంతో కవిత సీబీఐ కస్టడీ ముగియడంతో కోర్టులో హజరుపర్చారు. 14 రోజులు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీని సీబీఐ కోర‌గా దీనికి న్యాయ‌మూర్తి తిర‌స్కరించి తొమ్మిది రోజులకు ప‌రిమితం చేసింది. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.


అవి బీజేపీ ప్ర‌శ్న‌లు…
ఇదిలా ఉంటే కోర్టు ఆవరణలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా అవే ప్రశ్నలను తిప్పి తిప్పి అడుగుతున్నార‌ని అన్నారు. బ‌య‌ట బీజేపీ నేతలు మాట్లాడిన మాటలనే సీబీఐ అడుగుతుందన్నారు. అడిగింది అడుగుతున్నారు.. కొత్తది ఏమీ లేదన్నారు.

ముగిసిన సీబీఐ క‌స్ట‌డీ…
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను సోమ‌వారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఎదుట హాజరుపరిచారు. ఆమె తొమ్మిది రోజులు రిమాండ్ విధించారు. ఇక.. ఆదివారం విచారణలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్‌లు, మహబూబ్‌నగర్‌లో భూముల వ్యవహారం, ఆప్ నేతలకు ప్రాక్సీ ద్వారా డబ్బుల చెల్లింపులు, ఈ క్రమంలో బెదిరింపులపై కవితను ప్రశ్నించినట్లు స‌మాచారం..

- Advertisement -

క‌విత‌తో కేటీఆర్ భేటీ…
సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితను ఆదివారం రాత్రి ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈసందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. అయితే.. ప్రత్యేక కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 16న విచారణ జరగనుంది. కాగా, ఎమ్మెల్సీ కవితకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయొద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement