న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో కానుకలుగా వచ్చిన జ్ఞాపికలను కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ మోడ్రన్ ఆర్ట్ ( ఎన్జీఎంఏ)లో కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ సింగ్ మేఘవాల్, మీనాక్షి లేఖితో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్జీఎంఏలో ఉంచిన నరేంద్ర మోదీకి విదేశీ, రాష్ట్ర, ప్రాంత పర్యటనల్లో ప్రముఖులు అందజేసిన జ్ఞాపికలు, క్రీడాకారులు ఇచ్చిన వస్తువులను ఆయన ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈా వేలం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఎవరైనా కానుకలను వేలంలో దక్కించుకోవచ్చన్నారు. 2019 నుంచి మూడేళ్లుగా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రధానమంత్రికి వచ్చిన జ్ఞాపికలను వేలం వేస్తోందని, అత్యధికంగా గతేడాది 15 కోట్ల రూపాయలు వేలం ద్వారా వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. అలా వచ్చిన నిధులను స్వచ్ఛ భారత్, నమామి గంగే వంటి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఈ ఏడాది 1,222 జ్ఞాపికలను వేలానికి సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రతి వస్తువుకు దాని మార్కెట్ రేటును బట్టి వంద రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కనీస ధరగా నిర్ణయించామని, ఈ బిడ్డింగ్ ద్వారా దాదాపు రూ.2.70 కోట్ల నిధులు వస్తాయని అంచనా వేస్తున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. ఈ సారి అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వనాథ ఆలయం, కామన్వెల్త్, పారా ఒలంపిక్ గేమ్స్‌కు సంబంధించిన క్రీడాకారుల వస్తువులు ప్రత్యేక ఆకర్షణ అని ఆయన వెల్లడించారు. క్రీడాకారుల టీ షర్టులు, బ్యాడ్మింటన్ బ్యాట్, నేతాజీ ప్రతిమకు అత్యధికంగా రూ. 5 లక్షల కనీస ధర నిర్ణయించినట్టు కిషన్‌రెడ్డి అన్నారు. మహిళ, పురుష హాకీ టీంలు సంతకాలు పెట్టిన టీషర్ట్‌లు, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ సంతకం చేసిన బ్యాట్, ఇటీవల బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిక్కత్ జరీన్ గ్లౌజ్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధానికి అందజేసిన శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమలూ వేలంలో ఉన్నాయి. పెద్దసంఖ్యలో ఔత్సాహికులు ఈ వేలంలో పాల్గొనాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జ్ఞాపికలను కొనుగోలు చేసి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.