Sunday, November 24, 2024

IND vs NZ | గెలుపు నీదా.. నాదా ! సస్పెన్స్‌లో చివరి టెస్ట్..

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు ఉత్కంఠగా సాగుతోంది. ఇరు జట్లు గెలుపు కోసం హోరాహ‌రీగా పోరాడుతున్నాయి. ఈరోజు ఓవర్ నైట్ స్కోరు 86/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 263 పరుగులకు ఆలౌటైంది. అనంత‌రం 28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ పరుగులు చేసేలా కనిపించింది.

అయితే భారత బౌలర్లు కివీస్‌కు షాకిచ్చారు. భారత బౌలర్ల ధాటికి 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. ఇక‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయిన కివీస్ 171 పరుగులు చేసి భారత్‌పై 143 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా (4/52), రవిచంద్రన్ అశ్విన్ (3/63) వికెట్లు తీయ‌గా.. వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్ త‌లో వికెట్ ద‌క్కించుకున్నారు.

- Advertisement -

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. దూకుడుగా ఆడిన వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.

కాగా, రేప‌టి మూడవ రోజు ఆటలో ఉత్కంఠభరితమైన ఫ‌లితం వ‌చ్చే అవ‌వాశాలు క‌నిపిస‌తున్నాయి. కివీస్ జ‌ట్టు తక్కువ స్కోరింగ్ లక్ష్యాన్ని నిర్దేశించినా… సుడులు తిరుగుతున్న‌ పిచ్‌పై మ‌నోళ్లు ఎలా రాణిస్తార‌నే దానిపై గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. ఈ టెస్టులో ఇరు జ‌ట్ల‌కు సమాన విజయావకాశాలు క‌నిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement