Friday, November 22, 2024

ఈవీలకు మూడో పెద్ద మార్కెట్‌.. నెమ్మదిగా అమ్మకాల వృద్ధి

భారత దేశం విద్యుత్‌ వాహనాలకు ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ అంచనా వేసింది. దేశీయంగా అమ్మకాలు వృద్ధి తక్కువగా ఉన్నందున సమీప భవిష్యత్‌లో ఏ ఒక్క ఇండియన్‌ కంపెనీ కూడా గ్లోబల్‌ ఈవీ అమ్మకాల్లో తగినంత వాటా కలిగి ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఆసియా మాత్రం ఈవీ వాహనాల ఉత్పత్తిలో అతి పెద్ద ఉత్పత్తిదారుగానూ, అమ్మకాల్లో అతి పెద్ద మార్కెట్‌గా తన స్థానాన్ని నిలుపుకుంటుందని పేర్కొంది. దీనితో పాటు ఈవీ బ్యాటరీలు, బ్యాటరీ మెటిరియల్‌ ఉత్పత్తిలోనూ ఆసియా అతి ముఖ్యమైన కేంద్రంగా మారుతుందని తెలిపింది.

ఈవీ వాహనాలకు భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉందనుంది. ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీలకు భారత్‌ అమ్మకాల విషయంలో ముఖ్యమైనదిగా మారుతుందని ఎస్‌ అండ్‌ పీ రేటింగ్స్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇండియాలో గత సంవత్సరం ఈవీ వాహనాల అమ్మకాలు రెట్టింపు అయ్యాయని తెలిపింది. గత సంవత్సరం 12 నెలల కాలంలో మొత్తం తేలికపాటి వాహనాల అమ్మకాల్లో విద్యుత్‌ వాహనాల వాటా మాత్రం కేవలం 2 శాతంగానే ఉందని పేర్కొంది. అమ్మకాలు జరుపుతున్న వాటిలో 90 శాతం ఈవీలు టూ, త్రీ వీలర్స్‌ వాహనాలు ఉన్నాయని తెలిపింది. దేశంలో ఈవీ ఛార్జింగ్‌ సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిస్తే వేగంగా అమ్మకాలు పెరిగేందుకు అవకాశం ఉందని పేర్కొంది.

దేశీయంగా విద్యుత్‌ వాహనాల అమ్మకాలు ఇలానే నెమ్మదిగా సాగితే సమీప భవిష్యత్‌లో ఏ ఇండియన్‌ కంపెనీ కూడా గ్లోబల్‌ ఈవీల అమ్మకాల్లో తగిన వాటాను పొందే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇండియాలో ఈవీల మార్కెట్‌లో టాటా కంపెనీ 80 శాతం వాటాలో ముందుభాగాన ఉందని తెలిపింది. టాటా కంపెనీకి ఈ విషయంలో ఇతర కంపెనీల నుంచి పోటీ ఎదురవుతున్నప్పటికీ టాటా మోటార్స్‌ ఈవీల విషయంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఎస్‌అండ్‌ పీ అంచనా వేసింది. టాటాకు పోటీ ప్రధానంగా ఎంబీ మోటార్స్‌, హ్యుండాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి వస్తోందని పేర్కొంది. టాటా మోటార్స్‌కు చెందిన యూకే సబ్సిడరీ కంపెనీకి చెందిన జగ్వార్‌, ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలు విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టడంలో వెనుకబడి ఉన్నాయని, ఇది పోటీతత్వాన్ని బలహీనపరుస్తుందని తెలిపింది.

- Advertisement -

టాటా మోటార్స్‌ 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో విద్యుత్‌ వాహనాల వాటా 10 శాతం వరకు ఉంటుందని తెలిపింది. ఈ రంగంలో పెద్దగా భారీ పెట్టుబడుల అవసరం లేదని పేర్కొంది. టాటా మోటార్స్‌ కన్వర్టిబుల్‌ సాధనాల విక్రయం ద్వారా 1 బిలియన్‌ డాలర్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో రుణాల భాగం గణనీయంగా తగ్గిందని, టాటా మోటార్స్‌ మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ఆసియా ఈవీ వాహనాలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. విద్యుత్‌ వాహనాల రంగం వృద్ధిని కావాల్సిన వనరుల లభ్యత ఆసియాలో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.

ఇండోనేషియాలో నికెల్‌, చైనాలో లిథియం లభ్యత గణనీయంగా ఉందని తెలిపింది. దీంతో పాటు ఈవీ వాహనాల పట్ల చైనా అనుసరిస్తున్న సానుకూల విధానం, ఈ పరిశ్రమకు ముందుకు నడిపేందుకు అవసరమైన టెక్నాలజీ విషయంలో చైనా, కోరియా, జపాన్‌ దేశాలు ముందున్నాయని తెలిపింది. ప్రపంచంలోనే ఈవీలకు చైనా అతి పెద్ద మార్కెట్‌గా ఉందని, మొత్తం ఆసియా కలిపితే, ఇంత పెద్ద మార్కెట్‌ ప్రపంచంలోనే మరెక్కడా లేదని పేర్కొంది. ఈ కారణాల వల్ల రానున్న కాలంలో ఆసియా ఈవీ మార్కెట్‌ విషయంలో అగ్రస్థానంలో ఉంటుందని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్‌ అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement