హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన మరో అద్భుత కట్టడమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కమాండ్ కంట్రోల్ దేశానికే తలమానికంగా నిలువనుందని పేర్కొన్నారు. సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుందన్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను నగర సీపీ సివి ఆనంద్, ఆర్ అండ్ బి అధికారులు, వర్క్ ఏజెన్సీతో కలిసి మంత్రి బుధవారం పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం, ఆడిటోరియంలో వీడియో ప్రజెంటేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయాలు పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని మంత్రి సూచించారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ భవనాన్ని కలియతిరుగుతూ పరిశీలించనున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నూతన సాంకేతికతతో కమాండ్ కంట్రోల్‌ను నిర్మించినట్లు మంత్రి తెలిపారు.