Monday, October 21, 2024

TG | వచ్చే ఏడాది నుంచి సన్న బియ్యం : మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెల్లరేషన్‌ కార్డు దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త ఏడాదిలో చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీతో పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో పి.డి.యస్‌ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ పట్టుబడితే డీలర్‌ షిప్‌ రద్దు చేయాలని నిర్ణయించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చౌక ధరల దుకణాలన్నింటిలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించ నున్నట్లు మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ప్రకటించారు. గురువారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ… పి.డి.యస్‌ బియ్యం దారి తప్పితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పి.డి.యస్‌ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్‌ షిప్‌ రద్దు ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న1629 చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీకి వెంటనే ఉపక్రమించాలన్నారు.

ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్‌ వాడి, మధ్యాహ్న భోజనాలలో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. తరచు తనిఖీలు నిర్వహిస్తుంటే మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మహాలక్ష్మి పథకంలో బాగంగా లబ్ధిదారులకు వంటగ్యాస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్సిడీ మొత్తం లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విషయాన్ని వారికి ప్రస్ఫుటంగా చెప్పాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పౌరసరఫరాల శాఖా కార్యదర్శి డి.యస్‌.చౌహాన్‌లతో పాటు వైద్య ఆరోగ్య, ఉన్నత విద్య, బి.సి సంక్షేమ, యస్‌.సి సంక్షేమ, గిరిజన సంక్షేమ, విజిలెన్స్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ తదితర మొత్తం ఎనిమిది శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement