న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కళింగవైశ్య, శిష్టకరణ, సొండి కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడానికి కావలసిన చర్యలు చేపట్టవలసినదిగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓబీసీ సాధన కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మూడు సామాజిక వర్గాల ప్రతినిధుల బృందం బుధవారం బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావును న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు. ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై వారితో కూలంకషంగా చర్చించారు.
అనంతరం జీవీఎల్ నరసింహారావు కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర, ఎన్సీబీసీ ఛైర్మన్ హన్స్‌రాజ్ ఆహిర్‌తో సమావేశమై మూడు సామాజిక వర్గాల వెనుకబాటుతనం, వారిని ఓబీసీల్లో చేర్చాల్సిన అవసరంపై సమగ్రంగా చర్చించారు. అనంతరం కళింగవైశ్య, శిష్టకరణ, సొండి సామాజికవర్గ ప్రతినిధులతో కలిసి కేంద్రమంత్రి వీరేంద్రతో సమావేశమయ్యారు. ఆయా సామాజికవర్గ ప్రతినిధుల సమక్షంలోనే జీవీఎల్ కేంద్రమంత్రికి పూర్తి స్థాయి నివేదికను అందజేశారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి అధికారులను పిలిచి వెంటనే కార్యాచరణ ప్రారంభించవలసినదిగా ఆదేశించారు.
ఆ తర్వాత జీవీఎల్ నాయకత్వంలో సామాజిక వర్గాల ప్రతినిధులు జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ హన్స్‌రాజ్ ఆహిర్‌తో సమావేశమయ్యారు. దశాబ్దాలుగా ఓబీసీ జాబితాలో చేరడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు, సామాజికవర్గాల నేపథ్యం, వెనుకబాటుతనం గురించి వివరించి నివేదిక అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిందిగా జీవీఎల్ ఆయనను ఆహ్వానించారు. ఆగస్టు 1వ తేదీన ఈ మూడు సామాజిక వర్గాల వారిని కలిసేందుకు రాష్ట్రానికి వస్తానని హన్స్‌రాజ్ హామీ ఇచ్చారు. ఎన్సీబీసీ అధికారులను పిలిచి నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి ముందుకు వెళ్లవలసినదిగా ఆదేశించారు.
ఇన్నేళ్లు కాగితాలకు మాత్రమే పరిమితమైన తమ ఓబిసి సాధన కల ఎంపీ జీవీఎల్ ప్రయత్నంతో ముందుకు వెళ్తోందని కళింగవైశ్య, శిష్టకరణ, సొండి కులాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఓబీసీ పోరాటం సాకారమైతే కేంద్రప్రభుత్వ ఉద్యోగ, విద్యావకాశాల్లో వాటా కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిచ్చే అవకాశముందని అన్నారు.