న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని మల్కాజిగిరి ఎంపీ (కాంగ్రెస్) రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో భారతీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రేవంత్ రెడ్డి సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్న సంధించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానమిచ్చే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ నేతల హిందీ భాషపై నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన సభలోనే ఖండించారు. అనంతరం ఓ ట్వీట్ కూడా చేశారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేసిన రేవంత్ రెడ్డి, డాలర్ తోపోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోరినట్టు వెల్లడించారు. గతంలో రూపాయి విలువ 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ రూపాయి ఐసీయూలో పడిపోయిందని వ్యాఖ్యానించారని, కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని తెలిపారు. గత మూడేళ్లలో మొత్తం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచడానికి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వివరాలు తెలపాలని కోరినట్టు వెల్లడించారు.
ఈ ఏడాది మొత్తం రూపాయి పతనం కొనసాగుతనే ఉందని, 2021 డిసెంబర్ నుంచి రూపాయి విలువ క్షీణించడం మినహా బలపడింది లేదని రేవంత్ తెలిపారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రపంచ ప్రధాన కరెన్సీల కంటే భారత్ కరెన్సీ పతనమే ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 11.75 శాతం దేశీయ కరెన్సీ పతనమైందని, ఒకే ఏడాదిలో ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి అని రేవంత్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు అటు ప్రత్యక్షంగా, ఇటు పరోక్షంగా రూపాయి విలువను దిగజారుస్తున్నాయని, పాలకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రూపాయి పతనంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, వస్తు సేవలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సినపరిస్థితులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసే వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరు భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసిందన్నారు.
స్వాతంత్య్రం తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసినప్పులు రూ. 55,87,149 కోట్లు అయితే… 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.80,00,744 కోట్లు అని రేవంత్ తెలిపారు. 67ఏళ్లలో దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పుల కంటే.. కేవలం ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ అని మండిపడ్డారు. ఓ వైపు రూపాయి విలువ రోజురోజుకు పడిపోతున్నా మోదీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని ఎద్దేవా చేశారు. భారత్ మార్కెట్‌పై నమ్మకాలు సన్నగిల్లుతున్నా.. ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగించేందుకు మోదీ సర్కారు ఒక్క విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు.